వీణా వాణీ శస్త్రచికిత్సకు రంగం సిద్ధం

9 Jan, 2016 06:32 IST|Sakshi
వీణా వాణీ శస్త్రచికిత్సకు రంగం సిద్ధం

సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణీలను శస్త్రచికిత్స ద్వారా విడదీసే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అఖిల భారత వైద్య విద్యామండలి వైద్యులతో పాటు లండన్ నుంచి వచ్చిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శస్త్రచికిత్స ద్వారా వారిని విడదీస్తామంటూ లండన్ వైద్యులు గతేడాది ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారికి ఆపరేషన్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేయాలా లేదా లండన్‌లోనే చేయాలా అన్న దానిపై స్పష్టత రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది.

వీణా వాణీలను విడదీసే ఆపరేషన్ విజయవంతమవుతుందా లేదా అన్నదానిపైనా వైద్య నిపుణుల్లో జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో గురువారం నాటి ఢిల్లీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆపరేషన్‌కు ముందు వారికి ‘డిజిటల్ సబ్‌స్ట్రాక్షన్ యాంజియో’ పరీక్ష చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. అవిభక్త కవలలను విడదీసే ఆపరేషన్‌కు ముందు వారి మెదడుకు సంబంధించిన సమాచారాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. రాజధానిలోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో ఈ రకమైన పరీక్ష నిర్వహించే సదుపాయం ఉంది. ఈ పరీక్ష అనంతరం నివేదికను లండన్ వైద్యుల పరిశీలనకు పంపుతారు. ఈ పరీక్ష ద్వారా అందిన సమాచారం ఆధారంగానే వీరికి శస్త్రచికిత్స తేదీని నిర్ణయిస్తారని వైద్యుడొకరు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు