వెజిటేరియన్‌ కొర్రమీను మేడిన్‌ చైనా!

15 Aug, 2017 02:56 IST|Sakshi
వెజిటేరియన్‌ కొర్రమీను మేడిన్‌ చైనా!
కొర్రమీను ఉత్పత్తి పెంపునకు చైనా టెక్నాలజీ
- రాష్ట్రంలో వాటి సంతతిని తిరిగి పెంచే యత్నంలో మత్స్యశాఖ
వాటి అలవాటునే మార్చేసిన చైనా శాస్త్రవేత్తలు
మాంసాహార చేపలు శాకాహారులుగా మార్పు
- వేటాడే లక్షణమూ బంద్‌.. 
బయటినుంచి వేసిన ఆహారం తినేలా పరిజ్ఞానం
 
కొర్రమట్ట.. కొర్రమీను.. ఎలా పిలిచినా ఆ చేపను ఇష్టపడనివారుండరు. పులుసు, ఫ్రై ఎలా వండినా లోట్టలేసుకుంటూ తినేస్తారు.. ముళ్లు తక్కువగా ఉండడం, రుచి ఎక్కువగా ఉండడం దీని ప్రత్యేకత. కానీ రానురాను కొర్రమీను దొరకడం కష్టమవుతోంది. డిమాండ్‌ పెరిగిపోవడంతో ఏకంగా కిలో రూ.600 వరకు పలుకుతోంది. కృత్రిమంగా వీటి సంతతిని పెంచడానికి అవకాశాలూ లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మత్స్య శాఖ కొర్రమీను సంతతి పెంచడమెలాగనే దానిపై దృష్టి సారించింది. చైనాలో కొర్రమీను చేప పిల్లలను ఉత్పత్తి చేసి, పెంచే టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో.. అధికారులు ఆ దేశానికి వెళ్లి పరిశీలించి వచ్చారు.ఆ తరహా టెక్నాలజీతో రాష్ట్రంలోని కోయిల్‌సాగర్‌ రిజర్వా యర్‌లో కొర్రమీనులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  
 – సాక్షి, హైదరాబాద్‌
 
ముళ్లు తక్కువ.. రుచి ఎక్కువ
ఇతర చేపలేవైనా దాదాపు చనిపోయిన స్థితిలోనే విక్రయిస్తారు. కానీ కొర్రమీనును బతికుండగా విక్రయిస్తారు. ఇతర చేపలు కేవలం నీటిలోని ఆక్సిజన్‌ను సంగ్రహించే బతుకుతాయి. కానీ కొర్రమీను మాత్రం తక్కువ నీటిలోనూ బతకగలదు. అవి నీటితోపాటు గాలిలోని ఆక్సిజన్‌నూ సంగ్రహించగలవు. ఇక కొర్రమీనులో ముళ్లు తక్కువ.. రుచి చాలా ఎక్కువ. వండటానికి ముందే ముళ్లను పూర్తిగా తీసేయవచ్చు కూడా. దీంతో చిన్న పిల్లలూ ఇష్టంగా తింటారు. ఇక కొర్రమీను పులుసుతో కీళ్ల సంబంధిత నొప్పులు తగ్గుతాయని, పలు ఇతర సమస్యలు ఉపశమించేందుకూ తోడ్పడుతుందన్న ప్రచారం ఉంది.

రాష్ట్రంలో గోదావరి నదిలో శ్రీరాంసాగర్‌ ప్రాంతం నుంచి కరీంనగర్, వరంగల్‌ జిల్లాల వరకు కొర్రమీను లభిస్తుంది. కాలువల వసతి ఉన్న ప్రాంతాల నుంచి కొంత లభ్యమవుతుంది. రాష్ట్రంలో ఏడాదికి 2.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతుంటే.. అందులో కొర్రమీను కేవలం 2 శాతమే ఉండటం గమనార్హం. ఇది రాష్ట్ర అధికారిక చేప కూడా.
 
ఏటికేడు తగ్గిపోతూ
కొర్రమీను చేపల సంతతి ఏడాదికేడాది తగ్గిపోతోంది. కొర్రమీను సహజ లక్షణాలకు తోడు, ఇతర చేపల్లా కొర్రమీనును ప్రత్యేకంగా ఉత్పత్తి చేయలేకపోవడం దీనికి కారణం. పునరుత్పత్తి (హేచరీస్‌) కేంద్రాల్లో ప్రత్యేకంగా విత్తనాన్ని (చేప పిల్లలను) ఉత్పత్తి చేసి వాటిని జలాశయాలు, చెరువులు, కుంటల్లో వదలడం ద్వారా ఇతర చేపలను పెంచవచ్చు. ఆయా హేచరీస్‌లలో చేపలకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి చేప విత్తనాన్ని తయారు చేస్తారు. బొచ్చె, బంగారుతీగ, గడ్డి చేప పిల్లలను అలాగే ఉత్పత్తి చేస్తారు. అయితే అలాంటి పరిజ్ఞానం కొర్రమీను చేపల విషయంలో అందుబాటులో లేదు.

ఇది సహజ సిద్ధంగా చెరువులు, జలాశయాల్లో గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. దీని ప్రత్యుత్పత్తి సహజంగా జరుగుతుంది. పైగా ఇది మాంసహార చేప. ఇతర చేప పిల్లలను, చిన్న చేపలను వేటాడి తింటుంది. అందువల్ల వీటిని పునరుత్పత్తి కేంద్రాల్లో పెంచడం సాధ్యంకాదు. దీంతో కరువు, కాటకాల సమయంలో చెరువులు, జలాశయాల్లోకి నీరు చేరని సమయంలో వీటి సంతతి బాగా పడిపోతుంది. మరోవైపు పంట పొలాల్లో అధికంగా వాడే ఎరువులు, పురుగుమందులు వర్షాలతో చెరువులు, కుంటల్లోకి చేరి.. ఆ కలుషిత నీటి కారణంగా కొర్రమీను సంతతి తగ్గిపోతోంది. 
 
తమ పిల్లలను తామే...
సహజంగా గుడ్లు పెట్టి పిల్లలను కనే కొర్రమీను చేపలు ఆ పిల్లలను కొన్నాళ్ల వరకు మగ, ఆడ కలసి కాపాడతాయి. ఇతర చేపల నుంచి ఎటువంటి హాని జరగకుండా చూస్తాయి. పిల్లలను 40–50 రోజుల తర్వాత వదిలేస్తాయి. కానీ వాటిని వదిలేశాక ఏవి తన పిల్లలో గుర్తుపట్టక తామే తినేస్తుం టాయి కూడా. కొర్రమీను సంతతి తగ్గిపోవడానికి ఇదీ కూడా కారణమని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
కొర్రమీను అలవాటునే మార్చిన చైనా
చైనాలో కొర్రమీను కిలో ధర మన కరెన్సీలో రూ.200 మాత్రమే. దానికి కారణం అక్కడ కొర్రమీను ఉత్పత్తి పెరగడమే. ఆ దేశంలో పునరుత్పత్తి కేంద్రాల్లో కొర్రమీను విత్తనాన్ని తయారు చేసి జలాశయాల్లో వదిలేస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా ఐదు తరాలపై పెద్ద ప్రయోగం చేశారు. కొర్రమీను సహజ స్వభావాలను మార్చారు. దాంతో కొర్రమీను వేటాడే లక్షణం, మాంసహార స్వభావం పోయి.. శాకాహారిగా మారిపోయింది. అంతేకాదు పునరుత్పత్తి కేంద్రాల్లో ఇతర చేపల్లా హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి చేప విత్తనాన్ని తయారు చేశారు. ఆ చేప పిల్లలను చెరువులు, జలాశయాల్లో వదిలి ఇతర చేపల్లా పెరిగేలా చేశారు. దీంతో అక్కడ కొర్రమీను ఉత్పత్తి బాగా పెరిగింది.

రాష్ట్ర మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చైనాకు వెళ్లి.. ఈ విషయంపై అధ్యయనం కూడా చేసి వచ్చారు. అయితే కొర్రమీను విత్తనాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే టెక్నాలజీని బహిర్గత పరచడానికి చైనా శాస్త్రవేత్తలు ముందుకు రాలేదని ఆయన ‘సాక్షి’కి వివరించారు. వియత్నాం దేశంలోనూ ఇటువంటి టెక్నాలజీ ఉందని చెప్పారు.
 
ఇక్కడా చైనా తరహా టెక్నాలజీ..
చైనాలో దాదాపు ఐదు తరాలుగా కృషి చేసి కొర్రమీను చేపల అలవాట్లనే మార్చేశారు. దాంతో అక్కడ కొర్రమీను సంతతి పెరిగింది. అయితే కొర్రమీనును ప్రత్యేకంగా పునరుత్పత్తి చేసే టెక్నాలజీని బహిర్గతం చేయడానికి వాళ్లు ఇష్టపడడం లేదు. కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న మంచినీటి చేపల పరిశోధన కేంద్రంలో చైనా తరహా టెక్నాలజీతో కొర్రమీను చేప విత్తనం తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనిని వచ్చే ఏడాది కోయిల్‌సాగర్‌లో ప్రయో గాత్మకంగా పరిశీలించాలని అనుకుంటున్నాం. అందుకోసం భువనేశ్వర్‌ చేపల పరిశోధన కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నాం..
– శ్రీనివాస్,మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌
మరిన్ని వార్తలు