'బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది'

22 Apr, 2016 12:37 IST|Sakshi

కనీసం 10 ఏళ్లపాటు దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. దేశం నలుమూలలా బీజేపీ ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని ఆయన ఆరోపించారు. ఎస్సీలు, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని విమర్శించారు. కానీ త్వరలోనే వారు కూడా బీజేపీకి దగ్గర అవుతారన్నారు. బీజేపీలోనే ఎస్సీ, ఎస్టీ మహిళా ప్రజా ప్రతినిధులు సంఖ్య అధికంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


తెలంగాణలో బీజేపీ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరడానికి కృషి చేయాలని కార్యకర్తలకు వెంకయ్య పిలుపునిచ్చారు. నిత్యం  ప్రజల్లో ఉండే పార్టీనే వాళ్లు ఆదరిస్తారని చెప్పారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నదని దానిని వాడుకోవాలి అని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.  తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి... సమర్ధుడు కె. లక్ష్మణ్ బాగా పని చేస్తాడని కితాబు ఇచ్చారు. తెలంగాణ లో అన్ని వర్గాలను కలుపుకోగల నేర్పు లక్ష్మణ్ లో ఉందన్నారు. వార్తల కోసం , కాదు గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరాలి అని వారిని కోరారు. పేద ప్రజలకు ప్రధాని మోదీ ఓ ఆశా జ్యోతి అని అభివర్ణించారు. ప్రత్యర్ధులు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కరపత్రం ప్రతీ ఇంటికి వెళ్ళాలని అన్నారు.

దేశం ముందుకెళ్లాలని బీజేపీ కోరుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో నైట్ హాల్ట్ చెయ్యాలని నాయకులు, కార్యకర్తలకు హితువు పలికారు. హైదరాబాద్ వదలండి. గ్రామాల్లోని ప్రజలతో మమేకం అయితే బీజేపీని వాళ్లే ఆదరిస్తారన్నారు. ఉత్తరాఖండ్లో మెజారిటీ శాసన సభలో నిరూపించుకోవాలి. 356 ఆర్టికల్ , ఫైనాన్స్ బిల్ పాస్ అవ్వాలి రాజ్యాంగ సంక్షోభం ఉంది కాబట్టే ఆగామన్నారు. అసీంబ్లీ  రద్దు కాలేదు,  బల నిరూపణ ఎప్పుడైనా  చేసుకోవచ్చు. 

ఓటింగ్ కాకముందే  తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఓటింగ్ జరగలేదు, జరిగింది అని రెండు మాటలు ఎలా వస్తాయి. హిందూ , ముస్లిం , క్రిస్టియాన్స్ అందరు  భారతదేశ ప్రజలే, పౌరులే అని అన్నారు. మోడీ అధికారం లో ఉన్నాడు కాబట్టే రాహుల్ హెచ్సీయూకి వచ్చాడు. రోహిత్ వేముల విషయంలో దత్తాత్రేయ తప్పేం లేదని వెంకయ్య స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు