ఉగ్రభూతాన్ని మట్టుబెట్టే‘లా’ చేయండి

4 Sep, 2017 02:50 IST|Sakshi
ఉగ్రభూతాన్ని మట్టుబెట్టే‘లా’ చేయండి

అంతర్జాతీయ న్యాయ పండితుల సదస్సులో ఉప రాష్ట్రపతి
మానవ హక్కుల రక్షణకు న్యాయ నిపుణులు చర్యలు తీసుకోవాలి: గవర్నర్‌
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాలకు పెను భూతంగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అంతర్జాతీయ న్యాయ నిపుణులు కఠిన చట్టాలు రూపొందించాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉగ్ర వాదానికి కుల, మతాలు లేవని.. రాజకీయా లకు అతీతంగా, కలసికట్టుగా దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాలని విజ్ఞప్తి చేశారు. మానవ జాతికి తొలి శత్రువైన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే చట్టాలకు న్యాయ కోవిదు లంతా సిఫార్సు చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌ శామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ సంస్థ 78వ సమావేశాలను వెంకయ్య ప్రారంభించారు.

1873లో బెల్జియంలో 11 మంది అంతర్జాతీయ న్యాయవాదులతో ప్రారంభమైన సంస్థ సమావేశా లు తొలిసారి భారత్‌లో జరుగుతున్నాయి. వారంపాటు జరగనున్న ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి 60 మంది న్యాయ కోవిదులు హాజరయ్యారు. సదస్సు సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, శాంతి, సమానత్వం, మానవ హక్కుల రక్షణ, అభివృద్ధి కోసం సూచనలు చేస్తూనే వాటికి అవరోధంగా ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా న్యాయ నిపుణులు మేధోమథనం చేయాలన్నారు. ఏ దేశ ప్రభుత్వ ప్రలోభాలకు లోనవకుండా ఉన్నందునే 1904లో అంతర్జాతీయ న్యాయ సంస్థకు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చిందని.. ఆ స్ఫూర్తితోనే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు కృషి చేయాలని కోరారు.

పురాణ కాలంలోనే ధర్మ పాలన
ధర్మబద్ధ పాలన రామాయణ, మహాభారత కాలాల నుంచే దేశంలో ఉందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చెప్పే న్యాయమే ధర్మమని వెంకయ్య అన్నారు. వసుదైక కుటుంబ విధానమూ పురాణ కాలం నాటిదేనని, కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ‘ప్రభుత్వం–పాలన–న్యాయం’ గురించి ఏనాడో చెప్పారన్నారు. ‘రిఫామ్‌– పర్ఫామ్‌– ట్రాన్స్‌ఫామ్‌’ ప్రస్తుత భారత ప్రభుత్వ విధానమన్నారు.  ‘నేనూ లా చేసినా ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం జైల్లో పెట్టడంతో లాయర్‌ కాలేకపోయాను’ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు నాగేంద్రసింగ్, నీలకంఠశాస్త్రి  చేసిన న్యాయ సేవలు, ఇప్పుడు అంతర్జాయతీ సముద్ర జలాలపై పెమ్మరాజు శ్రీనివాసరావు (పీఎస్‌ రావు) చేస్తున్న కృషిని వెంకయ్య కొనియాడారు.

పుట్టుకతోనే మానవ హక్కులు: గవర్నర్‌
మనిషి పుట్టు్టకతోనే మానవ హక్కులొస్తా యని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఆ హక్కుల రక్షణకు న్యాయ నిపుణులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆ ర్‌ ప్రభుత్వం భూమి, ఇతర చట్టాలపై న్యాయ సంస్కరణలు తీసుకొస్తోందని రాష్ట్ర న్యాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ న్యాయ నిపుణులు హాజరైన ఈ సమావేశం మంచి సిఫార్సులు చేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ కోరారు. అంతర్జాతీ య న్యాయపర అంశాలపై తొలిసారి ప్రైవేట్, పబ్లిక్‌ రంగాలు కలసి పనిచేస్తున్నాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లా (జెనీవా) అధ్యక్షుడు పీఎస్‌ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, నల్సార్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఫైజాన్‌ ముస్తాఫా, రిజిస్ట్రార్‌ వి.బాలకిట్టారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు