తెలుగు సాహిత్యంలో రారాజు సినారె

30 Jul, 2017 03:30 IST|Sakshi
తెలుగు సాహిత్యంలో రారాజు సినారె
వెంకయ్య నాయుడు
 
సాక్షి, హైదరాబాద్‌: తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత దివంగత డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి(సినారె) రారాజు అని ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన సినారె 87వ జయంతి, చివరి కవితా సంపుటి ‘కలం అలిగింది’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సినారె అభినవ శ్రీనాథుడు, అభినవ సోమనాథుడు అని అభివర్ణించారు. ఎన్టీఆర్‌ సినిమాలు అంతటి ప్రాచుర్యం పొందటానికి కారణం సినారె అని అన్నారు. ప్రజాకవి అంటే సినారెలా ఉండాలని, ఆయన అచ్చమైన తెలంగాణ కవి అని పేర్కొన్నారు.

సినారె ఏకకాలంలో అన్ని వర్గాల ప్రజలను రంజింపచేసేవారని అన్నారు. ఇద్దరు ముఖ్యమం త్రులు తెలుగు భాషను రక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్‌లో సాహిత్యా నికి మాజీ ప్రధాని వాజ్‌పేయి, సినారె ప్రాముఖ్యత తెచ్చారని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాలకు సినారె చేసినంత సేవ మరెవరూ చేయలేరని చెప్పారు. 1953 నుంచి చనిపోయే వరకూ సినారె కవితలు రాస్తూ ఉండటం వల్లే సాహిత్యంలో ఆయన మకుటంలేని మహారాజు అయ్యారని కొనియాడారు. సినారె చిత్రపటాన్ని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరిం చారు. సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తాను సినారెకి ఏకలవ్య శిష్యుడినని అన్నారు. సినారె మనుమరాలు వరేణ్యా కవిత్వంలో ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని అన్నారు.

ఈ సందర్భంగా కలం అలిగింది పుస్తకాన్ని, వంశీ విజ్ఞానపీఠం లోగోను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ప్రముఖ గాయకురాలు శారద ఆకునూరి బృందం నిర్వహించిన మధుర భావాల సుమమాల సినీ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి, అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కళాబ్రహ్మ, వంశీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ వంశీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు