-

హైదరాబాద్‌లో విదేశీ భవన్‌

29 Jan, 2017 02:16 IST|Sakshi
ప్రగతిభవన్‌లో దానేశ్వర్‌ మూలే, ఇతర అధికారులతో భేటీ అయిన సీఎం కేసీఆర్‌.

కేంద్రానికి సీఎం కేసీఆర్‌ ప్రతిపాదన
సానుకూలంగా స్పందించిన విదేశాంగ శాఖ కార్యదర్శి మూలే
విదేశాలకు వెళ్లేవారి సంక్షేమానికి ఉమ్మడి విధానం ఉండాలి: కేసీఆర్‌


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐలకు సేవలందించేందుకోసం హైద రాబాద్‌లో విదేశీ భవన్‌ నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు విదేశాంగ శాఖ కార్యదర్శి దానేశ్వర్‌ మూలే సానుకూలంగా స్పందించారు. హైదరా బాద్‌లో విదేశీ భవన్‌ను నిర్మిస్తామని ప్రకటిం చారు. శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో దానేశ్వర్‌ మూలే సమావేశమయ్యారు. విదేశా లకు వెళ్లి మోసపోయేవారి విషయంలో, ఆపదల్లో చిక్కుకున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి సాయం అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై వారు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. విద్య, ఉద్యో గ, ఉపాధి అవకాశాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ రూపొం దించి, అమలు చేయాల్సిన అవసరముం దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

విదేశీ భవన్‌ ఎందుకంటే...
‘‘తెలంగాణ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు విదేశాలకు వెళ్తున్నారు. వారికి అనేక విష యాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సార్లు మోసాలు, ప్రమాదాలు, కిడ్నాప్‌లకు గురవుతున్నారు. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వారందరికీ తగిన సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. విదేశీ పెట్టుబడులు, సెజ్‌లకు అనుమతులు ఇస్తు న్నందున పెద్ద ఎత్తున విదేశీ పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు దేశానికి వస్తున్నారు. వారికి కూడా తగిన విధంగా ప్రభుత్వం సహకరించాలి. అందుకోసం విదేశీ రాయ బార కార్యాలయాలను బలోపేతం చేయాలి. రాష్ట్రాల రాజధానుల్లో కూడా విదేశీ భవన్లు నిర్మించాలి. తెలంగాణలో విదేశీ భవన్‌కు స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో విదేశీ వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ అధికారులకు తగిన సహకారం అందిస్తామ న్నారు. మంత్రి కేటీఆర్, ఇతర అధికారులతో తదుపరి కార్యాచరణపై చర్చలు జరపాలని కేంద్ర అధికారులకు సూచించారు.

విస్తృతం కావాలి...
‘‘భారతదేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగు తోంది. ఆరో∙అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌ విదేశాలతో మంచి సంబంధాలు నెరుపుతోంది. ఎగుమతులు, దిగుమతులూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రాధాన్యం కూడా బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ కార్యకలాపాలు కూడా పెరగాలి. ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లే వారికి, విద్య కోసం వివిధ దేశాలకు వెళ్లే వారికి తగిన అవగాహన కల్పిం చాలి. ప్రభుత్వమే మార్గదర్శకం చేసే విధంగా ఉంటే, మోసాలు తగ్గుతాయి’’అని సిఎం చెప్పారు. పదిహేనేళ్లుగా భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాలతో సంబంధాలను మెరుగు పర్చుకుంటు న్నాయని మూలే అన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖను బలోపేతం చేస్తోందని వివరించారు.

వరంగల్‌లో పాస్‌పోర్టు కార్యాలయం: మూలే
వరంగల్‌ నగరంలో పాస్‌పోర్టు సేవా కేంద్రం నెలకొల్పుతామని దానేశ్వర్‌ మూలే ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మూలే, ఈ మేరకు హామీ ఇచ్చారు. పాస్‌ పోర్టు కేంద్రం ఏర్పాటుకు వరంగల్‌లో అవసరమైన స్థలం కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పాస్‌పోర్టుల జారీలో జాప్యాన్ని నివారిస్తామని మూలే వెల్లడించారు. అత్యంత వేగంగా పాస్‌పోర్టులను జారీ చేసే రాష్ట్రంగా రికార్డు సృష్టించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని మూలే ప్రశంసించారు. ఈ సమావేశంలో రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి అశ్వని, తెలంగాణలో విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి విష్ణు, సీఎంఓ అధికారులు నర్సింగ రావు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు