విజిలెన్స్ గుప్పిట్లో కాలేజీల గుట్టు!

17 Jun, 2016 00:52 IST|Sakshi

* ఇంజనీరింగ్, బీఫార్మసి కాలేజీలపై నివేదిక తయారు చేసిన విజిలెన్స్
* వెయ్యి కాలేజీలపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేత

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, బీఫార్మసి కాలేజీల దుస్థితిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. నెల రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో వెల్లడైన అంశాలను క్రోడీకరించి ఈ నివేదిక రూపొందించింది. మొదటి విడతగా వెయ్యి కాలేజీలకు సంబంధించిన బాగోతాలు ఈ విచారణలో బయటపడ్డాయి.

కాలేజీల్లో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత, ఫ్యాకల్టీ అంశాల ఆధారంగా విచారణ జరిపారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు ఆదేశిస్తే.. అక్రమాలకు పాల్పడ్డ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
 
గుప్పిట్లో వెయ్యి కాలేజీల గుట్టు..
రాష్ట్రంలో వివిధ విభాగాలకు చెందిన దాదాపు 6,800 కాలేజీలు ఉన్నాయి. కాలేజీల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం నెల క్రితం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతీ రోజు దాదాపు 30 నుంచి 40 బృందాలు కాలేజీల స్థితిగతులను పరిశీలిస్తున్నాయి. పీజీ, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ తదితర విభాగాలకు చెందిన కాలేజీలను తనిఖీలు చేస్తున్నాయి.

ఇప్పటివరకు 1,200 కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీకి చెందిన కాలేజీలే ఎక్కువ. వీటిలో చాలా కాలేజీలు కనీసం మౌలిక వసతులను కూడా  కల్పించలేదని విజిలెన్స్ అధికారులు నివేదికలో ప్రస్తావించారు. ల్యాబ్ నిర్వహణ దారుణ మని, ఇలాగైతే విద్యార్థులకు సరైన శిక్షణ లభించడం కష్టమని పేర్కొన్నారు.

విద్యార్థుల హాజరు శాతం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే వారి వివరాలు అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సరైన భోదనా సిబ్బంది లేరని పేర్కొన్నారు. సిబ్బంది వివరాలు, జీతభత్యాలు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, బీఫార్మసీ కాలేజీలపై 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు