స్పీకర్ నిర్ణయానికి గడువు పెట్టాలి

14 Jul, 2016 02:24 IST|Sakshi
స్పీకర్ నిర్ణయానికి గడువు పెట్టాలి

- ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు
- రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు

 సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రస్తుతం అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కొన్ని కీలకమైన సవరణలు చేస్తూ ఒక ప్రైవేటు బిల్లును ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ఈ నెల 8వ తేదీన రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు ఒక నోటీసును ఇచ్చారు. తాను  ప్రస్తుత చట్టంలోని 316-బిలోని  కొన్ని అంశాలకు సవరణలు ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. చట్టసభలో ఓ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ (రాజ్యసభ లేదా లోక్‌సభ) మరో పార్టీలోకి వెళ్లినపుడు అతనిని అనర్హుడిని చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా నియమిత వ్యవధిలో ఆయన నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ప్రస్తుత చట్టంలో లేదు. విజయసాయిరెడ్డి దానిని సవరించాలని సూచించారు.

ఫిరాయించిన సభ్యుడి అనర్హతకు సంబంధించి ఫిర్యాదు అందిన ఆరు నెలలలోపు దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు. ఫిరాయించిన చట్టసభ సభ్యుడిపై చట్టం ప్రకారం అనర్హత వేటు పడితే అతని పదవీ కాలం పూర్తయ్యేవరకూ లేదా అతను మళ్లీ ఎన్నికయ్యేవరకూ లాభదాయకమైన రాజకీయ పదవిని చేపట్టరాదనేది ప్రస్తుత నిబంధనగా ఉంది. కానీ ఫిరాయించిన సభ్యునిపై స్పీకర్ వద్ద ఫిర్యాదు నమోదైన రోజు నుంచీ, ఆ ఫిర్యాదుపై స్పీకర్ చర్య తీసుకునేవరకూ లాభదాయకమైన రాజకీయ పదవి ఏదీ చేపట్టకూడదని సవరించాలని ప్రతిపాదించారు. ఒక వేళ ఫిరాయించిన సభ్యునిపై అనర్హత వేటు పడితే, అతని మిగతా పదవీకాలం ముగిసేవరకూ కూడా ఎలాంటి లాభదాయకమైన పదవీ చేపట్టకూడదని కూడా ఉండాలన్నారు. ఇక  361-బిలోని పేరా 6(2) ప్రకారం స్పీకర్‌కు వచ్చే అనర్హత ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు ఒక కాల పరిమితి అంటూ ఏమీ లేదు. ఇపుడు విజయసాయిరెడ్డి తన బిల్లులో ఆరు నెలలలోపుగా నిర్ణయం తీసుకునే విధంగా మార్పు చేయాలని సవరించారు. ఒకవేళ స్పీకర్  నిర్ణయం తీసుకోని పక్షంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునే విధంగా అనుమతిని ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు