అతన్ని కఠినంగా శిక్షించాలి: విక్రమ్‌ గౌడ్‌

29 Jul, 2017 17:20 IST|Sakshi
పోలీసులకు విక్రమ్‌గౌడ్‌ వాంగ్మూలం!

హైదరాబాద్‌: తనపై జరిగిన కాల్పుల విషయంలో మాజీ మంత్రి ముకేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. కాల్పులు జరగ్గానే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరిచానని తెలిపారు. తన అరుపులు విని భార్య షిపాలి కిందకు వచ్చిందని, 108కు ఫోన్‌ చేయాలని తానే ఆమెకు సూచించానని చెప్పారు. అంబులెన్స్‌ రాకపోవడంతో కారులోనే ఆస్పత్రికి భార్య తీసుకొచ్చిందని, ఆమెకు డ్రైవర్‌, వాచ్‌మెన్‌ సహకరించారని తెలిపారు.

తనకు బెదిరింపు కాల్స్‌ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. నొప్పి ఎక్కువగా ఉండటం వల్లే నిన్న పోలీసులతో మాట్లాడలేకపోయానని చెప్పారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. శుక్రవారం తెల్లవారుజామున విక్రమ్‌ గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుడి, ఎడమ భుజాల్లోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పటికే మీడియాతో మాట్లాడిన విక్రమ్‌ గౌడ్‌ భార్య షిపాలీ.. కాల్పుల విషయంలో మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. తమకు మంచి చేయకపోయినా పర్వాలేదుకానీ దుష్ర్పచారం చేయకండని ఆమె కోరారు. కాగా, విక్రమ్‌ గౌడ్‌ వెన్నుపూస భాగంలో బుల్లెట్‌ దిగిందని ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో వైద్యులు గుర్తించారు.

మరిన్ని వార్తలు