విక్రమ్‌ గౌడ్‌ డైరెక్షన్లో కాల్పుల డ్రామా

1 Aug, 2017 11:57 IST|Sakshi

హైదరాబాద్‌ : మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేష్‌ గౌడ్‌ తనయుడు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల కేసులో మిస్టరీ ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురానికి చెందిన నలుగురు నిందితులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు, విక్రమ్‌ గౌడ్‌కు గతంలోనే పరిచయం ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

అంతేకాకుండా  ఈ కాల్పుల సూత్రధారి విక్రమ్‌ గౌడేనని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సానుభూతి కోసమే విక్రమ్‌ కాల్పుల పథకం రచించినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినవారితోనే తతంగం నడిపినట్లు సమాచారం, తన ఇంటి వెనుక కొత్త చెరువులో గన్‌ పడేసినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మరోపక్క ఆర్థిక ఇబ్బందులు, ఆయుధ లైసెన్స్‌ పునరుద్ధరణ, కుటుంబానికి దగ్గర కావడం తదితర కారణాల నేపథ్యంలో ఈ కథ మొత్తానికీ విక్రమ్‌గౌడే సూత్రధారా అన్న కోణాన్నీ పరిగణలోకి తీసుకుని ఆరా తీశారు.

ఉదంతం జరిగిన విక్రమ్‌గౌడ్‌ ఇంటికి సమీపంలోనే ఆపోలో ఆస్పత్రి సైతం ఉండటంతో ఇంటినే స్పాట్‌గా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విక్రమ్‌ ప్రమేయం బయటపడి, ఆయన ప్లాన్‌ ప్రకారమే కాల్పులు జరిగినట్లు లేదా కాల్చుకున్నట్లు తేలితే ఆయనతో పాటు సంబంధం ఉన్న వారిపైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. అగంతకులు వాడిని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.  కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్న అతడు ఈ కాల్పుల డ్రామాకు తెరతీశాడు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు విక్రమ్‌తో పాటు అతడి భార్య షిపాలీపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు