భూఅక్రమాలకు ‘సేత్వారి స్కాన్‌’తో చెక్‌!

4 Jul, 2017 04:00 IST|Sakshi
భూఅక్రమాలకు ‘సేత్వారి స్కాన్‌’తో చెక్‌!
- గ్రామస్థాయి రెవెన్యూ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు
సర్వే నంబర్ల వారీగా.. సేత్వారి, పహాణి, కొలతలు, మ్యాప్, ఈసీ, ఇంజెంక్షన్‌ ఆర్డర్ల 
వివరాలన్నీ ఒకేచోట ఇప్పటికే 4 వేలకుపైగా గ్రామాల్లో 15 లక్షల సర్వే నంబర్లు నిక్షిప్తం
 
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలులో ఓ రైతు తనకున్న కొంత భూమి విక్రయిస్తున్నాడు.. దానిని ఎవరైనా కొనుగోలు చేయాలంటే సర్వే నంబర్‌ దగ్గరి నుంచి పట్టాదారుల వివరాలు, సేత్వారి, పహాణి, మ్యాపు, కొలతలు, రిజిస్ట్రేషన్లకు అవసరమైన ఈసీ రికార్డుల దాకా అన్నీ పరిశీలించాల్సిందే. వీటికితోడు ఆ భూమిపై ఉన్న వివాదాలు, కోర్టు ఇంజెంక్షన్‌ ఆర్డర్ల వంటివీ సరేసరి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎంతో కసరత్తు చేయకతప్పని పరిస్థితి. కానీ ఇక ముందు పరిస్థితి మారనుంది. కేవలం సర్వే నంబర్‌ ఆధారంగా అన్ని వివరాలూ ఒకే చోట లభించనున్నాయి. ఈ మేరకు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ అన్ని వివరాలను ఒకే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలోని 10 వేలకుపైగా గ్రామాల రెవెన్యూ మ్యాపులను కూడా అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
– సాక్షి, హైదరాబాద్‌
 
ఏం చేస్తారంటే..
భూముల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచడం కొత్త ప్రక్రియ ఏమీ కాదు. అయితే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలనూ ఒకేచోటికి తీసుకువచ్చే ప్రక్రియను ఇప్పుడు చేపట్టారు. ముందుగా గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను డిజిటలైజ్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తర్వాత సర్వే నంబర్ల వారీగా భూములను గుర్తించి, వాటి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందుకోసం సేత్వారి ఇండెక్స్‌ స్కానింగ్‌ ప్రక్రియను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవహారాలకు ముఖ్య భూమిక అయిన ఈ సేత్వారితో పాటు పహాణి, భూమి మ్యాప్, పాయింట్ల వారీ కొలతలు, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లు (ఈసీ) కూడా అక్కడే పొందుపరుస్తున్నారు. తద్వారా ఒక భూమికి సంబంధించిన అన్ని వివరాలు ఒక్క క్లిక్‌లోనే తెలిసిపోతాయి.
 
వేగంగా ప్రక్రియ..
ఇప్పటివరకు 15 లక్షలకు పైగా సర్వే నంబర్లను, 7,500 గ్రామాల రెవెన్యూ మ్యాప్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ కసరత్తు వేగవంతం చేస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలోని భూరికార్డులను ఆధునీకరించడంతో పాటు అక్రమ లావాదేవీలకు ఆస్కారం లేకుండా చెక్‌ పెట్టోచ్చనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలున్నాయి.
 
యూపీఏ హయాంలోనే..
భూరికార్డుల ఆధునీకరణ ప్రక్రియ యూపీఏ–2 ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. నేషనల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడర్నైజేషన్‌ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎం) కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 240 కోట్లు మంజూరయ్యాయి కూడా. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రక్రియను డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడర్నైజేషన్‌ (డీఐఎల్‌ఆర్‌ఎం)గా మార్చింది. దేశవ్యాప్తంగా బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలు ఈ ప్రక్రియలో ముందంజలో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక భూరికార్డుల ఆధునీకరణ కోసం సమగ్ర సర్వే చేయాలన్న రెవెన్యూ శాఖ ప్రతిపా దనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం తో గత నెలలోనే ఇక్కడా ఆ ప్రక్రియను చేపట్టారు. 
మరిన్ని వార్తలు