ఓటుతోనే సమాజంలో మార్పు

24 Jan, 2016 02:17 IST|Sakshi
ఓటుతోనే సమాజంలో మార్పు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
మణికొండ: మనతో పాటు చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందాలంటే మనమంతా ఓటు వేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాలలో ‘లెట్స్ ఓట్’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓటర్ల జాగృతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందమైన సమాజం, మానవవిలువలు, హక్కులు, ఆనందాలు, సుఖమయ జీవనం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారన్నారు.

అలాంటి పౌర సమాజాన్ని నిర్మించుకునేందుకు ఉన్నత విలువలు, సమస్యల నివారణకు కృషి చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మార్పులు తెచ్చే పనిలో భాగమైన ఓటు వేయడాన్ని పక్కనపెట్టి మారిపోవాలని ఆశించటం అతిశయోక్తే అవుతుందన్నారు. ఓటింగ్‌లో అందరూ పాల్గొంటే భిన్నమైన ఫలితం వస్తుందని చెప్పారు. అరోరా కళాశాల విద్యార్థులు ‘కౌన్‌బనేగా కార్పొరేటర్?’ అనే కాన్సెప్ట్‌తో వెబ్‌సైట్ ద్వారా విస్తృత  ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిలు ఇంటింటికీ తిరిగి ఓటు హక్కు విలువను చెప్పేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అలా వెళ్లే వారి బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని వారరు ప్రతినబూనారు. ఓటు హక్కుపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘లెట్స్‌ఓట్’ సంస్థ ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, సుబ్బరంగయ్య, కళాశాల ప్రిన్సిపాల్ మల్లీశ్వరి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు