రెవెన్యూ శాఖలో ‘పెట్టుబడి’ చిక్కుముడి..

15 Aug, 2017 01:50 IST|Sakshi
రెవెన్యూ శాఖలో ‘పెట్టుబడి’ చిక్కుముడి..
- వీఆర్వో, వీఆర్‌ఏలను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారని ప్రచారం
- రూ.4 వేల పెట్టుబడి పథకం అమలుకు గ్రామాల్లో రైతు సంఘాలు
దీంతో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ మనుగడపై సందేహాలు
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘాలు.. త్వరలో ఆందోళన బాట
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే, రికార్డుల ప్రక్షాళన వంటి కీలక కార్యక్రమాలు జరుగుతున్న వేళ రెవెన్యూ శాఖలో విచిత్రకర పరిస్థితులు నెలకొన్నాయి. శాఖాపరంగా క్షేత్రస్థాయిలో కీలకమైన వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను రెవెన్యూ శాఖ నుంచి తప్పించి వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. దీంతో డిప్యూటీ కలెక్టర్ల నుంచి వీఆర్‌ఏల వరకు అన్ని సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి.
 
అసలేం జరుగుతోంది?
వాస్తవానికి గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవహారాల్లో గ్రామ రెవెన్యూ అధికారులుగా వీఆర్వోలు, సహాయకులుగా వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారు. జనన, మరణ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక వరకు వీరే పర్యవేక్షిస్తున్నారు. భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల వ్యవహారాల్లోనూ వీరి భాగస్వామ్యం ఉంటోంది. అయితే వచ్చే ఖరీఫ్‌ నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ఇప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. తర్వాత భూములన్నింటినీ రీ సర్వే చేయనున్నారు. దీని ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ప్రత్యేక సర్వే నంబర్, పాసుబుక్కులు ఇచ్చి పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు చెప్పారు.

అయితే ఈ పథకం అమలు కోసం ప్రతి గ్రామంలో 6–12 మంది సభ్యులతో రైతు చైతన్య సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘమే గ్రామంలో జరిగే ప్రతి భూ లావాదేవీని పర్యవేక్షిస్తుంది. మ్యుటేషన్ల నుంచి క్రయ, విక్రయ లావాదేవీల వరకు ఈ సంఘమే రెవెన్యూ శాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. సంఘం సిఫారసు చేసిన లావాదేవీలను తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులకు రైతులు వెళ్లే అవసరం లేకుండానే పూర్తి చేయాలి. అంటే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను పరిశీలించి రికార్డులను సరి చేసుకున్న తర్వాత పాసుబుక్కులను నేరుగా రైతుకు తహసీల్దార్‌ కార్యాలయమే కొరియర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీఆర్వోలు, వీఆర్‌ఏల సహకారంతో తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈ పని జరుగుతోంది. ఇప్పుడు రైతు సంఘం సిఫారసు కీలకం కానుందనే ప్రతిపాదనే వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలకు మంగళం పాడతారనే ప్రచారానికి కారణమవుతోంది.
 
విలీనాన్ని ఒప్పుకోబోం..
భవిష్యత్తులో జరిగే భూ లావాదేవీల్లో రైతు సంఘం సిఫారసు కీలకమే అయినా వీఆర్వోలు, వీఆర్‌ఏల వ్యవస్థలకు ప్రమాదం లేదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. పెట్టుబడి సాయం పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెవెన్యూ, వ్యవసాయ శాఖలు, రైతు సంఘాలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, వీఆర్వో, వీఆర్‌ఏలు రెవెన్యూ వ్యవస్థలోనే ఉంటారని అంటున్నారు. భూ లావాదేవీల సిఫారసులు రైతు సంఘాల ద్వారానే జరిగినా, వాటి అమలు రెవెన్యూ శాఖ ద్వారానే జరగాలని, దీంతోపాటు వీఆర్‌వోలు నిర్వహించే ఇతర బాధ్యతలు కూడా ఉంటాయని చెబుతున్నారు. కానీ రెవెన్యూ సంఘాలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రెవెన్యూ శాఖలో కీలకమైన వీఆర్వో, వీఆర్‌ఏలను వ్యవసాయ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సర్వీసెస్, వీఆర్వో, వీఆర్‌ఏ సంఘాల నేతలు సోమవారం సమావేశమై తీర్మానించడం గమనార్హం.
 
రెవెన్యూ శాఖలోనే ఉంటాం
చంద్రబాబు హయాంలో మమ్మల్ని పంచాయతీరాజ్‌లోకి పంపినప్పుడు రెవెన్యూ రికార్డులకు జరిగిన నష్టాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఎంపీడీవోల ఆధీనంలో ఉన్నప్పుడు సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలలో ఎవరి దగ్గర పనిచేయాలో అర్థమయ్యేది కాదు. ఈ వ్యవస్థలోకి వచ్చిన తొమ్మిదేళ్లకు మళ్లీ వ్యవసాయ శాఖ అంటున్నారు. దీన్ని అంగీకరించేది లేదు. రెవెన్యూ శాఖలోనే పనిచేయాలనేది మా అందరి అభిమతం. 
– గోల్కొండ సతీశ్, తెలంగాణ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు

 

>
మరిన్ని వార్తలు