సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే..!

10 May, 2016 03:58 IST|Sakshi
సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే..!

ద్రవిడ వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 8 వేల మందికి ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించడంలో ఎలాంటి తప్పులేదని, రాష్ట్రంలో వర్సిటీల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలకు విశ్వసనీయత ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది.

దర్యాప్తు వల్ల ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్న నెపంతో నిలుపుదల చేయలేమంది. దర్యాప్తు పేరుతో ఎంఫిల్, పీహెచ్‌డీల కోసం ద్రవిడ వర్సిటీలో రిజిష్టర్ చేసుకున్న వ్యక్తులను ఏ రకమైన వేధింపులకు గురి చేయరాదని, దీనిపై  క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని సీఐడీ అదనపు డీజీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ద్రవిడ వర్సిటీలో  నిబంధనలకు విరుద్ధంగా ఎంఫిల్ డిగ్రీలు, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జె.ప్రసాద్‌బాబు, అప్పాజీ, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు.

మరిన్ని వార్తలు