విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

4 Sep, 2016 02:17 IST|Sakshi
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

తిరంగా యాత్రలో వెంకయ్య

 హైదరాబాద్: ఈ నెల17న తెలంగాణ  విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన మహనీయుల జీవితాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి యువతలో స్ఫూర్తి నింపాలని ఆయన సూచించారు. శనివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద నిర్వహించిన తిరంగా యాత్రకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి, వేలాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మతం వ్యక్తిగతమైందని.. గతం మాత్రం ఒక్కటేనని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ తెలుగువారేనని ఈ రెండు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ నివసిస్తున్న వారంతా భారతీయులేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు చిన్న విషయాలను పెద్దవిగా చూపిస్తూ దేశ విచ్ఛిన్నానికి కృషి చేస్తున్నారని ఒక్కసారి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. విచ్ఛిన్నకర శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మనమంతా భారతీయులమేనన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలని చెప్పారు.

 జాతి విచ్ఛిన్నానికి కుట్రలు
దేశద్రోహి అఫ్జల్‌గురు చనిపోతే విశ్వవిద్యాలయాల్లో రెచ్చగొట్టే స్మారకోపన్యాసాలు చేయడం,   సంఘీభావం తెలియజేయడం ఏంటని నిలదీశారు. పాశ్చాత్య వ్యామోహానికి లోబడిపోయి ఆత్మన్యూనతా భావంతో కొందరు స్వార్థపర శక్తులు యూనివర్సిటీల్లో జాతి విచ్ఛిన్నానికి కుట్రలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాంఘిక దురాచారాలను, అవినీతిని అరికట్టాలన్నారు. స్వచ్ఛభారత్‌ను నిర్మించుకోవాలన్నారు. రామరాజ్య స్థాపనకు అందరం కలసికట్టుగా కృషి చేయాలన్నారు.

శక్తిమంతమైన భారత్‌ను నిర్మించడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకారం అందించాలన్నారు. రాజకీయ విభేదాలను విడనాడి, అందరినీ కలుపుకొని పోతూ అందరం కలిసికట్టుగా ఉందాం అనే నినాదాంతో ప్రధాని ముందుకు వెళ్తున్నారని అన్నారు. గతాన్ని మర్చిపోయిన ఏ జాతి ముందుకు వెళ్లలేదన్నారు. రామరాజ్యం అంటే ఆకలిదప్పులు లేని, అవినీతికి తావులేని దేశమని అలాంటి రాజ్యం కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు.

>
మరిన్ని వార్తలు