నిమజ్జనం వ్యర్థాల వెలికితీత షురూ

16 Sep, 2016 20:37 IST|Sakshi

మహా నిమజ్జన పర్వం ముగిసింది. ఈసారి హుస్సేన్‌సాగర్‌లో సుమారు 51 వేల గణేష ప్రతిమలు నిమజ్జనం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్యాంక్‌బండ్ వైపు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనాలు కొనసాగాయి. ఈలోపు పెద్ద విగ్రహాల నిమజ్జనం పూర్తయిన ఎన్‌టీఆర్ మార్గ్‌లో వ్యర్థాల వెలికితీత పనులను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 3,456 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు చెప్పారు.శనివారం మధ్యాహ్నం నాటికి ఎన్‌టీఆర్ మార్గంలో వ్యర్థాల తొలగింపు ముగిస్తుందని చెప్పారు.

ఆ తర్వాత ట్యాంక్‌బండ్ పక్క వెలికితీత పనులు మొదలు పెట్టనున్నారు. ఇనుప, చెక్క ఫ్రేంలు, కొబ్బరి పీచు తదితర వ్యర్థాలు ఎక్కడికక్కడ జలాశయంలో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని ఆంఫిబియస్ ఎక్స్‌కవేటర్ ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి జేసీబీల ద్వారా వాహనాల్లో నింపుతున్నారు. గతేడాది 4,500 టన్నుల వరకు వ్యర్థాలు రాగా.. ఈసారి 5000 టన్నులకు చేరేఅవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది 4 అడుగుల పైబడి విగ్రహాల సంఖ్య పెరిగిందని పోలీసుల రికార్డుల ప్రకారం తెలుస్తోంది. 500 టన్నుల ఇనుము, 240 టన్నుల కలప, 200టన్నుల పీఓపీ సాగరంలో కలిశాయని పీసీబీ అంచనా వేస్తోంది. ఇందులో ఇనుము, కలప, కొబ్బరిపీచును 4500 టన్నుల మేర తొలగించినా..పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళసాగరం కానుందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. వ్యర్థాల తరలింపునకు ఆటంకం కలిగించింది. వాహనాల రాకపోకలు ఎన్‌టీఆర్ మార్గంలో నెమ్మదించడంతో వ్యర్థాలను డంప్ యార్డ్‌కు తరలించే టిప్పర్లు ముందుకు వెళ్లేందుకు గగనంగా మారింది. దీంతో తరలింపు పనులను కొద్ది సేపు నిలిపివేయాల్సి వచ్చిందని హెచ్‌ఎండీఏ ఈఈ జే.కృష్ణారావు, డీఈఈ దయాకర్‌రెడ్డి తెలిపారు.

 

మరిన్ని వార్తలు