‘నీళ్ల శాఖ’ మెయిల్‌ హ్యాక్‌ 

25 Jan, 2018 02:07 IST|Sakshi

‘వుయ్‌ నీడ్‌ ఏ ఫేవర్‌’ అంటూ ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు మెయిల్‌

బ్యాంకు పెద్దల నుంచి ఫోన్‌లు రావడంతో అప్రమత్తమైన  ‘కాడా’ కమిషనర్‌

పోలీసులకు ఫిర్యాదు, నైజీరియన్‌ల పనిగా గుర్తింపు   

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్, ట్వీటర్‌లను హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా నీటిపారుదల శాఖనే టార్గెట్‌ చేశారు. కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కాడా) పరిధిలోని నాగార్జునసాగర్‌ ఆధునీకరణ పనులకు సంబంధించి వినియోగిస్తున్న మెయిల్‌నే హ్యాక్‌ చేశారు. హ్యాక్‌ చేసిన మెయిల్‌ నుంచే ఏకంగా ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు ‘వుయ్‌ నీడ్‌ ఏ ఫేవర్‌’అంటూ మెయిళ్లు పంపారు. మెయిల్‌ను రిసీవ్‌ చేసుకున్న కొందరు ఎలాంటి ఫేవర్‌ కావాలంటూ శాఖ అధికారులకే ఫోన్‌లు చేయడంతో హ్యాక్‌ విషయం బయటపడింది.  

అసలేం జరిగిందంటే...

రాష్ట్ర ప్రభుత్వం 2008లో ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్‌ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనులకు సంబంధించి ‘కాడా’అధికారులు అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ సెక్టార్‌ ఇంప్లిమెంట్‌ ప్లాన్‌ను తయారు చేశారు. అదే అర్థం వచ్చేలా ఏపీడబ్ల్యూఎస్‌ఐపీ’పేరుతో ఒక మెయిల్‌ అడ్రస్‌ను క్రియేట్‌ చేసి దాని నుంచే ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, ఇతర శాఖల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే మంగళవారం రాత్రి ఈ మెయిల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు, దాన్నుంచి అందులోని ప్రధాన మెయిల్‌ అడ్రస్‌లన్నింటికీ ‘వుయ్‌ నీడ్‌ ఏ ఫేవర్‌’అంటూ మెయిల్‌ సందేశం పంపారు.

సుమారు 50 నుంచి 60 మంది వరకు ఇదే రకమైన మెయిల్‌ వెళ్లింది. ఈ మెయిల్‌ రాత్రిపూట పంపడంతో దీన్ని శాఖ అధికారులెవరూ గుర్తించలేదు. అయితే ఉదయం ఈ విభాగం ప్రాజెక్టు డైరెక్టర్, ‘కాడా’కమిషనర్‌గా ఉన్న మల్సూర్‌కు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘రాత్రి మెయిల్‌ పంపారు. మీకు ఎలాంటి ఫేవర్‌ కావాలి’అని ఆ ప్రపంచబ్యాంకు ప్రతినిధి అడగడంతో ఆయన అవాక్కయ్యారు. ఎలాంటి మెయిల్‌ పంపలేదని చెప్పడంతో ఫోన్‌ చేసిన ప్రతినిధి సైతం కంగుతిన్నారు. ‘ఉదయం ప్రపంచబ్యాంకు ప్రతినిధి ఫోన్‌చేసి ఎలాంటి ఫేవర్‌ కావాలని అడగ్గానే కంగారు పడ్డా. తరువాత మెయిల్‌ విషయం చెప్పాడు. మరికొద్ది సేపటికే మరో ప్రపంచ బ్యాంకు అధికారి నుంచి ఫోన్‌చేసి మెయిల్‌ విషయమే అడిగారు. అయితే నేను హైదరాబాద్‌లో లేకపోవడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.

మళ్లీ కొద్దిసేపటికే ప్రస్తుతం ఏపీలో సెక్రటరీ స్థాయిలో ఉన్న ఐఏఎస్‌ అధికారి నుంచి ఇదే మెయిల్‌ గురించి ఫోన్‌ వచ్చింది. వెంటనే మా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో అసలు విషయం బయటపడింది’అని మల్సూర్‌ ‘సాక్షి’కి తెలిపారు. వెంటనే దీనిపై బషీర్‌బాగ్‌లోని సైబర్‌ సెల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో దీన్ని నైజీరియన్‌కు చెందిన సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిసింది. అనంతరం మెయిల్‌ సందేశం పంపిన అడ్రస్‌లన్నింటికీ ‘ఈ మెయిల్‌ హ్యాక్‌ చేయబడింది. ఫేవర్‌ చేయాలంటూ వచ్చిన మెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు’అంటూ తిరిగి మెయిల్‌ పంపారు.  

మరిన్ని వార్తలు