అన్నదాత ఆశలు ఆవిరి

21 Aug, 2014 00:47 IST|Sakshi
అన్నదాత ఆశలు ఆవిరి

* ప్రధాన రిజర్వాయర్లలోకి చేరని నీరు  
* 250 టీఎంసీల మేర కొరత

 
* అక్టోబర్ తర్వాతి పరిస్థితిపై అప్పుడే ఆందోళన
* సాగు, తాగు నీటి కష్టాలు తప్పవంటున్న అధికారులు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రెండు నెలలు గడుస్తున్నా వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం రైతులను కలవరపెడుతోంది. ప్రస్తుతం రాష్ర్టంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటికీ కష్టాలు తప్పవటున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 250 టీఎంసీల మేర నీటి కొరత ఉందని అధికారులు అంచనా వేశారు. కృష్ణాతో పోల్చితే గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో కొత్తగా చుక్క నీరు కూడా చేరడం లేదు. దీంతో శ్రీరాంసాగర్, సింగూర్, నిజాంసాగర్, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఈ సీజన్‌కు ప్రాజెక్టులపరంగా115 టీఎంసీల మేర కొరత ఉండగా, కృష్ణాపై ఉన్న నాగార్జునసాగర్, జూరాలలో మరో 130 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా కష్టతరంగా మారనుందని అధికారులే అంటున్నారు.
 
ప్రాజెక్టుల తాజా పరిస్థితి
సింగూరు: జంట నగరాల తాగునీటి అవసరాలను తీర్చడంలో ముందున్న సింగూరు నుంచి ఈ ఏడాది పొడవునా నీటి సరఫరా కష్టంగా మారనుంది. ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు ఏటా 6 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, అందులో ఇప్పటికే గ్రావిటీ ద్వారా, మంజీరా పంపింగ్ ద్వారా 5.2 టీఎంసీల మేర నీటి సరఫరా జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.8 టీఎంసీల బ్యాలెన్సింగ్ మాత్రమే ఉంది. మొత్తం సామర్థ్యం 30 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 11.26 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అక్టోబర్ తర్వాత రాజధాని తాగునీటి  అవసరాలకు సింగూర్ జలాల పంపిణీ కష్టంగా మారనుంది.
 
ఎస్సారెస్పీ: ఎస్సారెస్పీలో ఈ ఏడాది చుక్క నీరు కూడా కొత్తగా వచ్చి చేరలేదు. దీంతో 90.31 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ కేవలం 20.75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి సాధారణంగా ఏటా 5.5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడతారు. కానీ ప్రస్తుత నిల్వలను బట్టి తాగునీటికి 4 టీఎంసీలు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీటి కటకట తప్పేలా లేదు. రానున్న రబీలో ప్రాజెక్టు పరిధిలోని 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే.
 
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం పరిధిలోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎగువ నుంచి అంతా ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టులో 312.045 టీఎంసీల నిల్వ సామర్థ్యానికిగానూ 183.77 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో 6.50 లక్షల ఎకరాలకు గాను కేవలం 4 లక్షల ఎకరాలకే సాగు నీరిచ్చారు. ఇక ఆంధ్రా ప్రాంతంలో 14.50 లక్షల ఎకరాలకు గానూ 5.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు.
 
జూరాల: జూరాలలో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ  వారం రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 1383 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉండగా వెయ్యి క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.
 
మండుతున్న రైతు గుండె
అసలే వర్షాలు లేక కలవరపడుతుంటే.. కరెంటు కోతలూ తోడవడంతో రైతుల గుండెలు మండుతున్నాయి. అందుబాటులో ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేక మథనపడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. అరకొర వర్షాలతో ఈసారి ఆలస్యంగా పనులు మొదలుపెట్టిన అన్నదాతలకు ఇది శాపంగా మారింది. కరెంటు లేక బోర్లు, బావుల్లో ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేకపోతున్నారు. ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటల నుంచి ఆరు గంటలకు ప్రభుత్వం అధికారికంగానే కుదించింది.
 

అయితే పేరుకే ఆరు గంటలు కానీ పట్టుమని రెండు మూడు గంటల కరెంటు కూడా అందడం లేదు. హైదరాబాద్‌లో 4 గంటలు, జిల్లా కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటల పాటు సరఫరా నిలిపేస్తున్నారు. ఇక గ్రామాల్లోనైతే కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిశ్రమలకూ వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలులో ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో రాష్ర్టవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ అంచనాలను మించి ఉంటోంది. 19వ తేదీన రాష్ట్రంలో 147 మిలియన్ యూనిట్ల(ఎంయూ) డిమాండ్ నమోదు కాగా, సరఫరా మాత్రం 135 ఎంయూలకే పరిమితమైంది.
 
పాతాళంలో భూగర్భ జలాలు
రాష్ర్టంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు, బావులు  వట్టిపోయాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌లో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తాగునీటికి కటకట ఏర్పడుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జూలై నెలలో ఆదిలాబాద్ జిల్లాలో 5.49 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యంకాగా.. ఈ ఏడాది జూలైలో 8.84 మీటర్లలోకి పడిపోయాయి.
 
ఇదే కాలంలో నిజామాబాద్ జిల్లాలో 7.60 మీటర్ల నుంచి 10.85 మీటర్లకు, కరీంనగర్ జిల్లాలో 6.45 మీటర్ల నుంచి 9.08 మీటర్లకు.. ఖమ్మం జిల్లాలో 6.33 మీటర్ల లోతు నుంచి 8.70 మీటర్లకు చేరాయి. ఇక హైదరాబాద్‌లో 7.39 మీటర్ల నుంచి 9.59 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. కాగా రాష్ట్రంలో ఈ సీజన్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం(ఆగస్టు 20) నాటికి సాధారణంగా 517.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 231.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే ఏకంగా 55 శాతం లోటు కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు