నీటి మట్టాలు పడిపోతున్నాయ్‌!

27 Feb, 2017 03:42 IST|Sakshi
నీటి మట్టాలు పడిపోతున్నాయ్‌!
  • శ్రీశైలంలో ఇప్పటికే పడిపోయిన కనిష్ట నీటిమట్టం
  • నాలుగు అడుగులు దాటితే సాగర్‌కూ అదే పరిస్థితి  
  • సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణకి ప్రధాన నీటి వనరుగా ఉన్న కృష్ణా నదిలో ఈ ఏడాది నీటికి కటకట తప్పేలా లేదు. వర్షాకాలం ఆరంభానికి మరో నాలుగు నెలల ముందే కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు అడుగంటి పోవడం కలవర పరుస్తోంది. ఇప్పటికే ఉన్న నీటినంతా సాగు, తాగు అవసరాలకు వాడేయడంతో శ్రీశైలంలో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోగా, మరో నాలుగు అడుగులు దాటితే నాగార్జునసాగర్‌కు అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినా, సాగర్‌లోకి పెద్దగా నీటి ప్రవాహాలు రాలేదు. ఎగువన శ్రీశైలానికి వచ్చిన నీటిని ఇష్టం వచ్చినట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడేయడంతో ఆ ప్రభావం సాగర్‌పై పడింది. దీంతో ప్రస్తుతం సాగర్‌లో నీటినిల్వ 590 అడుగులకుగానూ 514 అడుగులకు పడిపోయింది. ఈ మట్టంలో ప్రస్తుతం 138.56 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా, కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన లభ్యత ఉన్న నీరు 7.9 టీఎంసీలు మాత్రమే. దీంతో నాలుగు అడుగులు దాటితే చాలు ఇక్కడ కనీస నీటిమట్టానికి దిగువన నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

    ఇప్పటికే శ్రీశైలంలో 885 అడుగులకుగానూ నీటిమట్టం 824.7 అడుగులకు పడిపోయింది. ఇక్కడ కనీస నీటిమట్టం 834 అడుగులే అయినప్పటికీ అవసరాల కోసం దిగువకు వెళ్లి నీటిని వాడేస్తున్నారు. ఇక్కడ మరో నాలుగు అడుగుల వరకు అంటే 820 అడుగుల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. లభ్యత నీరు ఇలా ఉంటే రాష్ట్రాల అవసరాలు మాత్రం భారీగానే ఉన్నాయి. రాష్ట్రానికి తాగునీటికే నెలకు 2 నుంచి 4 టీఎంసీల చొప్పున మరో 15 టీఎంసీల మేర అవసరం ఉంటుంది. ఇక ఏపీ ఇప్పటికే తనకు రావాల్సిన వాటా కింద కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాల్వ కింద 3 టీఎంసీలు వదలాలని పట్టుపడుతోంది. దీనికి వత్తాసుగా కృష్ణా బోర్డు సైతం ఏపీ వాటా నీటిని విడుదల చేయాలని తెలంగాణపై ఒత్తిడి పెంచుతోంది. అసలే నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ఈ ఒత్తిళ్లు మరింత తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. అవసరాలు ఇదే మాదిరి ఉంటే గతేడాది మాదిరే వీలైనంత దిగువకు వెళ్లి నీటిని తోడుకోవాలనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు