మిగిలింది 36 టీఎంసీలే!

9 Feb, 2018 01:22 IST|Sakshi

ఈసారి రాష్ట్రానికి నీటి కటకటే

సాగర్, శ్రీశైలంలో ప్రస్తుత లభ్యత 71.31 టీఎంసీలు

ఏపీకి 17.09, తెలంగాణకు 17.90 టీఎంసీలు పంచిన కృష్ణా బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ఈ ఏడాది నీటి కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో జలాలు అడుగంటుతుండడంతో మార్చి నెల నుంచే తిప్పలు మొదలుకానున్నాయి. కృష్ణా బోర్డు ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న 71.31 టీఎంసీల జలాల నుంచి ఇరు రాష్ట్రాలకు 34.99 టీఎంసీలను కేటాయించింది.

ఇందులో తెలంగాణకు సాగర్‌ ఎడమ కాల్వ కింది అవసరాలకు 11 టీఎంసీలు, ఏఎమ్మార్పీకి 4.4 టీఎంసీలు, కల్వకుర్తికి 2.5 టీఎంసీలు కలిపి మొత్తంగా 17.90 టీఎంసీలు ఇచ్చింది. ఏపీకి సాగర్‌ కుడి కాల్వకు 10.5 టీఎంసీలు, హంద్రీనీవాకు 4, సాగర్‌ ఎడమ కాల్వకు 2.09, పోతిరెడ్డిపాడుకు 0.5 టీఎంసీలు కలిపి మొత్తంగా 17.09 టీఎంసీలు కేటాయించింది. ఈ నీటిని ఫిబ్రవరి అవసరాలకు వాడుకోవచ్చని.. నీటి వినియోగానికి వీలుగా శ్రీశైలం నుంచి 26 టీఎంసీలను సాగర్‌కు విడుదల చేయాలని సూచించింది.


మార్చి తర్వాత ఇబ్బందులే!
ప్రస్తుతం పంచిన 34.99 టీఎంసీలను పక్కన పెడితే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మిగిలే లభ్యత జలాలు 36.32 టీఎంసీలు మాత్రమే. ఇందులో ఇప్పటికే నిర్ణయించిన వాటా (66:34) మేరకు ఏపీకి 21.8 టీఎంసీలు, తెలంగాణకు 14.6 టీఎంసీలు దక్కే అవకాశముంది. ఈ నీటినే వచ్చే ఆగస్టు వరకు తాగు, సాగు అవసరాలకు వినియోగించుకోవాలి. అయితే తెలంగాణకు ఒక్క సాగర్‌ కిందే మార్చి నెలలో 13.6 టీఎంసీల నీటి అవసరాలున్నాయి.

ఇందులో ఎడమ కాల్వ కింద 9 టీఎంసీలు, ఏఎమ్మార్పీ కింద 2, హైదరాబాద్‌ తాగునీటికి 1.6, మిషన్‌ భగీరథకు ఒక టీఎంసీల నీటి అవసరం ఉంటుందని రాష్ట్రం ఇప్పటికే కృష్ణా బోర్డుకు సమాచారమిచ్చింది. ఈ లెక్కన ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాలన్నీ మార్చి అవసరాలకే సరిపోతే.. తర్వాతి అవసరాలకు నీరెలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు కల్వకుర్తి ప్రాజెక్టు కింద మరో 10 టీఎంసీలను సాగు అవసరాలకు కేటాయించాల్సి ఉంది.

అటు ఆంధ్రప్రదేశ్‌కు సైతం ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ఆ రాష్ట్రానికి దక్కే 21.8 టీఎంసీలతో నీటి అవసరాలు తీరేలా లేదు. దాంతో ఏప్రిల్‌ నుంచే సాగర్, శ్రీశైలంలో కనీస మట్టాల కన్నా దిగువన నీటిని తోడేసుకునే పరిస్థితి ఖాయమని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి.  

మరిన్ని వార్తలు