గోజాతి సంరక్షణలో విఫలమయ్యాం

12 Jul, 2016 03:37 IST|Sakshi
గోజాతి సంరక్షణలో విఫలమయ్యాం

- జాతీయ బుల్‌షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఏపీలో 2.5 లక్షల ఒంగోలు గిత్తలు..
- బ్రెజిల్‌లో 16 కోట్లు: ఏపీ స్పీకర్ కోడెల
- ముగిసిన జాతీయ గిత్తల ప్రదర్శన

 
సాక్షి, హైదరాబాద్: ‘‘పులులు, సింహాల సంరక్షణకు అనేక చట్టాలు తెచ్చారు. కానీ కోట్లాది మందికి ఆహారం, జీవనాధారం కల్పించే గోజాతిని సంరక్షించడంలో మాత్రం మనం విఫలమయ్యాం’’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జలవిహార్‌లో జాతీయ గిత్తల ప్రదర్శన కన్నుల పండువగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన పలు మేలు రకాల గిత్తలను ప్రదర్శించారు. అంకుష్ సంస్థ ఏర్పాటు చేసిన బుల్‌షో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సినీ నటి అమల, కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి ఓపీ చౌదరి, బ్రెజిల్ వ్యవసాయ శాఖ మంత్రి జుయో క్రూజ్ రెయిస్ ఫిల్‌హో, పంజాబ్ మంత్రి గుల్జార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి మనకు ప్రసాదించిన వృక్ష, జంతు, పక్షి జాతులను సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
 తప్పకుండా పశుపోషణుండాలి: కోడెల
ఒంగోలు గిత్తలు ప్రస్తుతం ఏపీలో 2.5 లక్షలుంటే.. బ్రెజిల్ దేశంలో 16 కోట్లున్నాయని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అన్ని రకాల జాతులను ఆ దేశస్థులు పెంచి పోషిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. తెలంగాణలోని తూర్పు గోవును వెలుగులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. గోమాతలో ఔషధ గుణాలున్నాయని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. తన తల్లికి కేన్సర్ సోకిందని, అనేక రకాల మందు లు వాడామని అయితే రెండేళ్లుగా గో మూత్రాన్ని ఔషధంగా వాడుతున్నందున కేన్సర్ లక్షణాలు ప్రస్తుతం కనిపించడం లేదని చెప్పారు. అంతకుముందు సినీనటుడు మోహన్‌బాబు గిత్తలను చూడడానికి ప్రత్యేకంగా వచ్చారు. తాను గిత్తలను పెంచకపోయినా... అవంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉండే ‘తూర్పుగోవు’ను ‘తెలంగాణ గోవు’గా ప్రకటించాలని అంకుష్ సంస్థ తరపున వేణుగోపాల్ కోరారు.
 
 ఆయనకు 24 వేల ఆవులు, ఎడ్లు..
 బ్రెజిల్‌కు చెందిన డాక్టర్ జోస్ ఒటావియో లెమాస్ బుల్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈయనకు 10 వేల ఎకరాల భూమి, 24 వేల పశు సంపద ఉంది. అందులో 10 వేల ఆవులున్నాయి. వాటిని ఆయన స్వయంగా పెంచుతున్నారు. పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్న ఆయనకు 4 హెలికాప్టర్లు ఉన్నాయి. అంకుష్ సంస్థతో కలిసి ఈయన ఈ షో నిర్వహించారు.
 
 ఆకట్టుకున్న ర్యాంప్ వాక్
 వివిధ మేలుజాతి గిత్తల ర్యాంప్‌వాక్ (బుల్‌షో) చూపరులను ఆకట్టుకుంది. మొదటగా తెలంగాణకు చెందిన ‘తూర్పుగోవు’ను వేదికపైకి తీసుకొచ్చారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది తట్టుకొని జీవించగలుగుతుంది. అచ్చంపేట ప్రాంతంలో ఇది ఉంటుంది. ఏపీకి చెందిన పుంగనూరు గిత్త, కేరళకు చెందిన వెచ్చూరు గిత్త, వివిధ రకాల ఒంగోలు గిత్తలు, ఏపీకి చెందిన దేవరకోట జాతి గిత్త, గుజరాత్‌కు చెందిన గిర్, కాంక్రేజ్ గిత్తలను వేదికపై వాక్ చేయించారు. ఈ సందర్భంగా వివిధ జాతి గోవులను కాపాడుతున్నవారికి 26 మందికి గ్లోరియస్ నంది అవార్డులను అందజేశారు.

మరిన్ని వార్తలు