గెలిచేది మేమే!

4 Feb, 2016 00:18 IST|Sakshi
గెలిచేది మేమే!

ఎవరి ధీమా వారిదే
 

అభ్యర్థుల తరఫున భారీగా బెట్టింగులు
కౌంటింగ్ సన్నాహాల్లో యంత్రాంగం
తొలుత మెహిదీపట్నం, ఆఖరున సుభాష్ నగర్ ఫలితం

 
సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు మాదంటే.. మాదేనంటూ ప్రధాన రాజకీయ పక్షాలు బుధవారం రోజంతా లెక్కలు వేసే పనిలో పడ్డాయి. వివిధ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలను సమీక్షిస్తూ... ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థుల అనుయాయులు బెట్టింగులకు తెరలేపారు. ఏకపక్షంగా పోలింగ్ జరిగిన ప్రాంతాలు మినహాయిస్తే.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో వివిధ సీట్లపై భారీగా బెట్టింగులు సాగుతున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి 80కి పైగా స్థానాల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే... ఎంఐఎం వ్యూహకర్తలు తాము 45 స్థానాల్లో గెలిచి తీరుతామని తేల్చారు. ఇక బీజేపీ సొంతంగా 28 డివిజన్లలో గెలుస్తామని చెబుతోంది. టీడీపీ నేతలు సైతం అంతే సంఖ్యలో సీట్లు సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తార్నాక, జాంభాగ్, వెంకటేశ్వర కాలనీ, ఏఎస్‌రావు నగర్, కొత్తపేట, గోషా మహల్, రెడ్‌హిల్స్, భాగ్‌అంబర్‌పేట, వెంగళరావు     నగర్, నేరెడ్‌మెట్, పురానాపూల్, శాలిబండ, ఘాన్సీబజార్ తదితర స్థానాలతో పాటు మొత్తం 25 సీట్లకుపైగా  గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేసింది.

తొలి ఫలితం మెహిదీపట్నం
ఎన్నికల యంత్రాంగం బుధవారం రోజంతా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో తలమునకలైంది. గ్రేటర్‌లోని 26 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రతి డివిజన్‌లోనూ 7 నుంచి 14 టేబుళ్లపై లెక్కించనున్నారు. మొత్తం ఓట్లలోనే అతి చిన్న డివిజన్‌గా గుర్తింపు పొందిన మెహిదీపట్నంలో 10,233 (34.28శాతం) ఓట్లు మాత్రమే పోల్ కావటంతో తొలుత అక్కడి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆపై 13,327 ఓట్లు పోలైన బార్కాస్, 13,797 ఓట్లు పోలైన రెయిన్‌బజార్, 13,078 ఓట్లు పోలైన టోలిచౌకీ డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం ఓట్లతో పాటు పోలైనవి కూడా అధికంగా ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం(29,458 పోలైన ఓట్లు), సుభాష్‌నగర్ (38,963 పోలైన ఓట్లు)తో పాటు 27వేలకు పైగా ఓట్లు పోలైన సనత్‌నగర్, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, బాలాజీనగర్, ఫతేనగర్,గోల్నాక తదితర డివిజన్ల ఫలితాలను ఆలస్యంగా ప్రక టించే అవకాశం ఉంది. మొత్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మూడు నుంచినాలుగు గంటల్లో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.
 

మరిన్ని వార్తలు