'స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వలేం'

23 Nov, 2015 21:04 IST|Sakshi
'స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వలేం'

సాక్షి, హైదరాబాద్: 'ఔట్‌లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో ఆమెకు నోటీసులు అవసరం లేదని పేర్కొంది. నోటీసులు జారీ చేయాల్సిన తరుణం వచ్చిందని తాము భావిస్తే అప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.  'ఔట్‌లుక్' కథనంపై స్మితా సబర్వాల్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన పోలీసుల కేసును కొట్టేయాలంటూ ఆ ప్రతిక ప్రతినిధులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసినందున, ప్రస్తుత కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఔట్‌లుక్ వ్యవహారంలో న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం స్మితా సబర్వాల్‌కు రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం  మరోసారి వాదనలు విన్నది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్మితా సబర్వాల్ వ్యవహారంలో ప్రభుత్వం ఈ విధంగా ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదన్నారు.

అయితే పిటిషనర్ల వాదనతో ధర్మాసనం విభేదించింది. ఐఏఎస్‌ల ప్రతిష్టే ప్రభుత్వ ప్రతిష్టని పేర్కొంది. ఈ సమయంలోనే ఔట్‌లుక్ ప్రతినిధులపై కేసు కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చర్చ రాగా.. ఆ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని, తీర్పు రిజర్వులో ఉందని న్యాయవాదులు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అయితే ఈ తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని, ఆ తరువాత ఈ వ్యాజ్యాలపై విచారణ చేపడుతామని తెలిపింది. దీనికి సత్యంరెడ్డి స్పందిస్తూ, స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ దశలో నోటీసులు అవసరం లేదని, అవసరమనుకున్నప్పుడు తాము తప్పక జారీ చేస్తామంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు