మనకు కేంద్ర ఉద్యోగాలు వద్దా?

16 Feb, 2017 03:29 IST|Sakshi
మనకు కేంద్ర ఉద్యోగాలు వద్దా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర యువత దూరం

2015లో 57 వేల పోస్టులకు తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు పొందింది 8 శాతమే
సరైన శిక్షణ, మార్గదర్శనం లేకే కేంద్ర ఉద్యోగాలపై అనాసక్తి
రాష్ట్ర యువత తీరుపై పరిశీలన జరిపిన ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై రాష్ట్ర యువతలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. డిగ్రీ అర్హతతో రాష్ట్రంలో భర్తీ చేసే గ్రూప్‌–2 వంటి ఉద్యోగాలకు లక్షలాది మంది దరఖాస్తు చేస్తున్నా... అదే అర్హతతో కేంద్రం అధీనంలోని స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వంటి సంస్థలు జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. సొంతంగా సిద్ధమయ్యే పరిస్థితి లేకపోవడం, తగిన శిక్షణ అందకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... కేంద్ర ఉద్యోగాలకు సిద్ధమయ్యే రాష్ట్ర యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇదీ పరిస్థితి: 2015లో స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లోని 57,542 పోస్టులను భర్తీ చేసింది. తెలంగాణ నుంచి ఉద్యోగాలు పొందిన వారు తక్కువ. ఎస్‌ఎస్‌సీ సదరన్‌ రీజియన్‌ పరిధిలో తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం 57,542 పోస్టుల్లో సదరన్‌ రీజియన్‌ రాష్ట్రాల వారికి దక్కిన పోస్టులు 4,932 (8.58 శాతం) మాత్రమే. ఇందులో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు దక్కించుకున్న పోస్టులు 3 శాతం లోపే. అదే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 19,426 (33.21 శాతం) దక్కించుకున్నారు. సెంట్రల్‌ రీజియన్‌ పరిధిలోని రాష్ట్రాల అభ్యర్థులు 11,269 (21.31 శాతం) దక్కించుకున్నారు. మిగతా పోస్టులను ఈస్టర్న్‌ రీజియన్‌ రాష్ట్రాలవారు సొంతం చేసుకున్నారు. ఎస్‌ఎస్‌సీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

కేంద్ర ఉద్యోగాలపై దృష్టి..
ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం ఉపాధి అవకాశా లను అందుబాటులోకి తేవడంతోపాటు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యువతను సిద్ధం చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కె.తారకరామారావు ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే వంటి విభాగాల ఆధ్వర్యంలో ఏటా 50 వేల నుంచి లక్ష వరకు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 2018 నాటికి 2.83 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో ఆ ఉద్యోగాలకు రాష్ట్ర యువతను సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల యువతకు ఈ శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుం దని భావిస్తోంది. అందుకే మన టీవీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిక్షణలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రత్యామ్నాయంగా చూపితే మేలు..
రాష్ట్రంలో డిగ్రీ నుంచి మొదలు కొని పీజీలు, పీహెచ్‌డీలు, వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు పూర్తి చేసి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత 13 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. టీఎస్‌పీఎస్సీ అమల్లో కి తెచ్చిన వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఓటీఆర్‌లో భారీ సంఖ్యలో రిజిస్టర్‌ చేసుకున్నారు కూడా. రాష్ట్ర ప్రభుత్వంలోనూ పెద్దగా ఉద్యోగాలను భర్తీ చేయలేని పరిస్థితి. వివిధ కారణాలతో సకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయలేకపోతోంది. అయితే ఉద్యోగాలు ఆశిస్తున్నవారి సంఖ్యతో పోలిస్తే.. ఉద్యోగాల భర్తీ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.

>
మరిన్ని వార్తలు