అక్బరుద్దీన్‌పై కేసుల్లో దర్యాప్తు పూర్తి చేశాం

12 Apr, 2016 03:33 IST|Sakshi

హైకోర్టుకు పోలీసుల నివేదన

 సాక్షి, హైదరాబాద్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై నిజామాబాద్, నిర్మల్‌ల్లో నమోదయిన కేసుల్లో సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు ఈ వ్యాజ్యంపై ఇక తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అక్బరుద్దీన్‌పై నమోదు చేసిన కేసులో ఎటువంటి పురోగతి లేదని, పోలీసులు దర్యాప్తును పక్కన పెట్టేశారని ఆరోపిస్తూ నగరానికి చెందిన సయ్యద్ తరాక్ ఖాద్రీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా హోంశాఖ తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ స్పందిస్తూ, అక్బరుద్దీన్ కేసుల్లో సత్వరమే దర్యాప్తును పూర్తి చేసి సంబంధిత కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేశామని కోర్టుకు నివేదించారు.

>
మరిన్ని వార్తలు