వారికి నీటి సరఫరా అడ్డుకోండి

6 May, 2016 01:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే.. ప్రభుత్వం శీతల పానీయాలు, బీరు తయారీ కంపెనీలకు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తోందని, దీనిని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిల్ కావడంతో దీనిని వెకేషన్ కోర్టులో విచారించడం సాధ్యం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మౌఖిక ఉత్తర్వులు జారీ చేసింది.

రేవంత్ తన వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌లతో పాటు పలు శీతల పానీయాలు, బీరు తయారీ కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
 
ఆ నీటిని ప్రజలకు మళ్లించండి
శీతల పానీయాలు, బీరు తయారు కంపెనీలకు ప్రభుత్వం రోజుకు 1,512 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోందని, ఐపీఎల్ కోసం రోజుకు 60 మిలియన్ లీటర్ల నీటిని ఇస్తోందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. జాతీయ నీటి విధానం ప్రకారం నీటి సరఫరా విషయంలో మొదటి ప్రాధాన్యత తాగునీటికి, పశువుల అవసరాలకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కంపెనీలకు సరఫరా చేసే నీటిని ప్రజలు తాగేందుకు, ఇతర అవసరాలకు, పశుపక్ష్యాదులకు, వ్యవసాయ అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రేవంత్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.

>
మరిన్ని వార్తలు