ప్రభుత్వాన్ని నిలదీస్తాం

25 Sep, 2015 02:18 IST|Sakshi
ప్రభుత్వాన్ని నిలదీస్తాం

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
గాంధీ ఆస్పత్రి:
విష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే... టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని...ప్రజారోగ్యంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ శాసనసభా పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శిం చింది. మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు, పారిశుద్ధ్యం తీరుతెన్నులను పరిశీలించింది. సెల్లార్‌లోని లక్ష్మీ గణపతి క్యాంటీన్‌కు వెళ్లి... మోండా మార్కెట్‌లో మిగిలి పోయి... ఆవులకు వేసే కూరగాయలు తెచ్చి వంటలు చేస్తున్న దృశ్యాన్ని చూసి నేతలు అవాక్కయ్యారు. వంటలకు వాడుతున్న నూనె  నాసిరకంగా ఉండడంతో శాంపిల్స్ తీసుకున్నారు.

డిజాస్టర్, స్వెన్‌ఫ్లూ వార్డుల్లో వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు... క్షేత్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరెంటెండెంట్ వేంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, ఎన్‌వీఎస్ ప్రభాకర్, నాయకులు వెంకటరెడ్డి, భవర్‌లాల్‌వర్మ, శ్యామసుందర్‌గౌడ్, రవిప్రసాద్‌గౌడ్, ప్రభుగుప్తా, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
క్యాంటీన్ సీజ్...
గాంధీ ఆస్పత్రి సెల్లార్‌లో ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి క్యాంటీన్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు గురువా రం మధ్యాహ్నం సీజ్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష బృం దం క్యాంటీన్‌ను సందర్శించిన నేపథ్యంలో ఆగమేఘాల మీద సికింద్రాబాద్ సర్కిల్ వైద్యాధికారి సుధీర్‌ప్రసాద్, శానిటరీ సూపర్‌వైజర్ శ్రీనివాస్‌లు రంగంలోకి దిగారు.

మరిన్ని వార్తలు