We want బెటర్ సిటీ

10 Jan, 2016 04:42 IST|Sakshi
We want బెటర్ సిటీ

♦ అవినీతి అంతం..అభివృద్ధి మంత్రం.. అదే అందరి నినాదం
♦ పొలిటీషియన్లు మారాల్సిందే.. గళమెత్తిన యువత

ఓపెన్ డిబేట్
 మన హైటెక్ సిటీ విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి రాకెట్ స్పీడ్‌లో వెళ్తుందని.. ఆధునిక సాంకేతికత, అద్భుత నైపుణ్యతతో కలల నగరంగా మారబోతోందని పాలకులు చెబుతున్నారు. మరి ప్రజలేమంటున్నారు..!! జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ భాగ్యనగరంపై సిటీ యువత అభిప్రాయాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. నారాయణగూడలోని రెడ్డి మహిళా కళాశాలలో జరిగిన చర్చాగోష్టిలో యువత గళం విప్పారు. వ్యవస్థలో వేళ్లూనికొనిపోయిన అవినీతిని అంతం చేయనిదే అభివృద్ధిని సాధ్యం కాదన్నారు. పాలకుల్లో మార్పు వస్తేనే ‘డ్రీమ్ సిటీ’ సాధ్యమవుతుందన్నారు.
 - కాచిగూడ
 
 పారిశుధ్యానికి పెద్దపీట
 మన నగరం క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలి. చెట్లను నరకొద్దు. మొక్కలు విరివిగా పెంచాలి. రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వైద్య సౌకర్యాలను పెంపొందించాలి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ అంటూ చీపురు పట్టుకుని నాయకులు, అధికారులు ఫొటోలకు ఫోజులిచ్చే బదులు ఆచరణలోకి దిగాలి.
 - పి.వైష్ణవి, అంబర్‌పేట
 
 మహిళలకు రక్షణ ముఖ్యం
 సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు మారుతున్నా, ఎన్ని చట్టాలు తెస్తున్నా మహిళలపై వేధింపులు తగ్గడం లేదు. సమాజంలో ముఖ్యంగా పురుషుల్లో మార్పు రానంతకాలం ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం ఉండదు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తే మహిళలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
 - ఆర్.రచన, వారసిగూడ
 
 అవినీతి రహిత నగరం...
 ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చల విడిగా అవినీతి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా డబ్బులు లేనిదే పనులు జరగడం లేదు. ప్రతి పనికి ఇంత రేటు నిర్ణయించుకుని, ఆ డబ్బు ముట్టజెప్పితే కానీ పనులు చేయడం లేదు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే అసలైన డ్రీమ్‌సిటీ. ప్రతిరోజూ అనేక చోట్ల అవినీతి చేపలు పట్టుబడుతున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. ఇలాంటి అవినీతి పరులు ఉన్నంత కాలం నగరం ఎంత అభివృద్ధి చెందినా పేదప్రజలకు న్యాయం జరగదు.   
- పి.ప్రసన్న, ఓల్డ్‌సిటీ
 
 మహిళా స్పెషల్ బస్సులు కావాలి
 ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు పోకిరీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. మహిళలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి.
 - వి.స్వాతి, ఉప్పుగూడ
 
 ఉన్నత విద్యావకాశాలు కల్పించాలి
 నగర ప్రజలు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నత విద్యాసంస్థలను స్థాపించాలి. సమాజంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తేవాలి. చదువుకున్న.. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తుందన్న నమ్మకం ప్రభుత్వం కల్పించాలి.
 - ఎ.స్వర్ణలత, బర్కత్‌పుర
 
 కోడ్ కూసినా..!
 నాయకులు తమ గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంటారు. ఇందుకు కూడళ్లలోను.. రోడ్డు వెంట బ్యానర్లు కడుతుంటారు. ఎన్నికల కోడ్ కూసిందంటే వీటన్నింటినీ తొలగించాలి. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలను బల్దియా అధికారులు తొలగించారు. అయితే, కోడ్ అమల్లోకి వచ్చినా అధికారులు తిరిగిన ప్రాంతాల్లో ఒకటైన వెంగళరావునగర్ డివిజన్‌లో ఇంకా ప్రచార బ్యానర్లు, ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి.
 - వెంగళరావునగర్
 
 ‘కోడ్’ కొరడా..
 పావలా పనిచేస్తే పదిరూపాయల ప్రచారం చేసుకుంటారు నేతలు. పాలకుల చూపు తమ మీద పడాలని తాపత్రయ పడే వీరాభిమానులు పార్టీ జెండాలు, పోస్టర్లను భుజాన మోస్తుంటారు. జెండా కిందపడితే అవమానం జరిగిందని వీరంగం వేస్తారు. మరి ఎన్నికల కోడ్ కూసిందంటే ఎంతటి పెద్ద నేత పోస్టర్ అయినా చెత్త బండి ఎక్కాల్సిందే. శనివారం సికింద్రాబాద్‌లోని పీజీరోడ్‌లో వెలిసిన కటౌట్లను తొలగించి చెత్త రిక్షాలో ఇలా తరలించారు.
 - రాంగోపాల్‌పేట్
 
 ఫ్లాష్ బ్యాక్ 1934
 ఇరుకు సందుల్లో దుకాణాలు.. కాలు కదపలేని విధంగా ఫుట్‌పాత్‌ను సైతం ఆక్రమించేసిన వ్యాపారులు.. గృహోపకరణాల నుంచి చెవి రింగుల వరకు తక్కువ ధరకు లభించే మార్కెట్ నగరంలో ఏదన్నా ఉందంటే అది అబిడ్స్ ప్రాంతమే. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు ఎంతో విశాలంగా ప్రశాంతంగా ఉండేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. ఈ చిత్రంలో కనిపిస్తున్నది 1934లో తీసిన అబిడ్స్ సర్కిల్ ప్రాంతం. అప్పటికి ఇప్పటికి అసలు పోలికే లేనట్టు మారిపోయింది.

మరిన్ని వార్తలు