మా రాష్ట్రానికి మేము వెళ్తాం..

29 Apr, 2016 02:32 IST|Sakshi
మా రాష్ట్రానికి మేము వెళ్తాం..

ఏపీ జెన్‌కో ఎండీ గది ఎదుట బైఠాయించిన టీఎస్ విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తమను సొంత రాష్ట్రానికి రిలీవ్ చేయాలని కోరుతూ ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలను తీవ్రతరం చేశారు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ సౌధలోని ఏపీ జెన్‌కో మేనేజింగ్ డెరైక్టర్ కావేటి విజయానంద్ గది ఎదుట సుమారు 200 మంది తెలంగాణ ఉద్యోగులు ధర్నాకు దిగి గంటపాటు బైఠాయించారు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన చేశారు.

రాష్ట్ర విభజనకు ఏడాదిలోపే ఉద్యోగుల విభజన పూర్తికావాల్సి ఉండగా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అందుకు అడ్డుపడుతున్నాయని తెలంగాణ ఉద్యోగులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్వ్ టు ఆర్డర్ కింద ఏడాదిపాటు ఏపీలో పనిచేశామని ఇక పరాయిరాష్ట్రంలో ఎక్కువ కాలం కొనసాగలేమని ఉద్యోగులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఏపీజెన్‌కో సీఎండీ గది ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామన్నారు. అప్పటికీ తమను రిలీవ్ చేయకపోతే వచ్చే నెల 2న విద్యుత్ సౌధను ముట్టడించి ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. అయితే, తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లపై స్పందించేందుకు ఏపీ జెన్‌కో ఎండీ కె.విజయానంద్ నిరాకరించారు.

ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎండీ స్పందించకూడదని ఆయన కార్యాలయ వర్గాలు విలేకరులకు తెలిపాయి. తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, మధుసూదన్‌రెడ్డి, జానయ్య తదితరులు ఈ ధర్నాలో పాల్గొని తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు.

మరిన్ని వార్తలు