విశ్వేశ్వరయ్య విజన్ కావాలి!

26 Sep, 2016 01:42 IST|Sakshi
విశ్వేశ్వరయ్య విజన్ కావాలి!

* రాజధానికి వరద ముప్పు తప్పాలంటే ఇదే మార్గమంటున్న నిపుణులు
* కిర్లోస్కర్ కమిటీ సిఫారసుల అమలు తక్షణావసరం

సాక్షి, హైదరాబాద్: 1908 సెప్టెంబరు 28... రాజధాని మూసీ వరదల ధాటికి కొట్టుకుపోయింది. దీనికి పరిష్కారం కోసం విఖ్యాత ఇంజనీరు, దార్శనికుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అప్పటి నిజాం ప్రభుత్వం నగరానికి ఆహ్వానించింది. ఆయన కృషి, ముందుచూపుతో మూసీ వరదల నిరోధానికి పటిష్ట ప్రణాళిక సిద్ధమైంది. తొలిసారిగా మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా ఏర్పాటైంది.
 ...సరిగ్గా 108 ఏళ్ల తరువాత నేడు మహానగరంలో అదే పరిస్థితి. ఎడతెగని కుంభవృష్టితో నగరం నీట మునిగింది.

సెప్టెంబరులో కనీవినీ ఎరుగని రీతిలో 462 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మాసంలో సాధారణం (84 మి.మీ.) కంటే 448% అధిక వర్షపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. శతాబ్దం తరువాత నగరం మహావిపత్తును ఎదుర్కొంటోంది.

 
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొనుంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదనేది నిపుణులు అంటున్నారు. నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడుకోవాలంటే నేడు విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ విజన్ అవసరమంటున్నారు. అలాగే... 16 ఏళ్ల క్రితం కిర్లోస్కర్ కమిటీ చేసిన విలువైన సిఫారసులు అమలు చేస్తేనే నగరానికి ముంపు నుంచి మోక్షం లభిస్తుందంటున్నారు. సుమారు రూ.12 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ సిఫారసుల అమలుతోపాటు నాలాలను, చెరువులను కబ్జాచేసి నిర్మించిన సుమారు 28వేల అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
 
కిర్లోస్కర్ కమిటీ ఏం చెప్పింది...
భారీ వర్షాలు కురిసినపుడు వరద ప్రవాహం సాఫీగా వెళ్లేందుకు 2000లో కిర్లోస్కర్ కమిటీ విలువైన ప్రతిపాదనలు చేసింది.   
* ప్రధాన నగరంలో 173 ప్రధాన నాలాలు 390 కి.మీ. మేర ప్రవహిస్తున్నాయి. వీటిలో వరద ప్రవాహం 25 నుంచి 50 శాతం మాత్రమే వెళుతోంది. మిగతా ప్రవాహం సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది.
* నాలాలు, చెరువుల్లో ఉన్న సుమారు 28 వేల అక్రమ నిర్మాణాలను తొలగించాలి  
* శరవేగంగా పట్టణీకరణతో కాంక్రీట్ జంగిల్‌గా మారి, వర్షపునీటి ప్రవాహం ఒకేసారి పెరగడం, నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురవడం నగరం నీట మునగడానికి కారణాలుగా చెప్పింది.
 
నాలాల విస్తరణకు చేసిన సిఫారసులివే..
* డబీర్‌పురా మురికి నాలాను 10 మీటర్ల నుంచి 23 మీటర్ల వరకు విస్తరించాలి
* వారాసీగూడకి ఆనుకొని ప్రవహిస్తున్న నాలాను 3 మీటర్ల నుంచి 7 మీటర్ల మేర విస్తరించాలి
* ఎల్.ఎన్.దర్గా వద్ద నాలాలను 3.5 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరించాలి
* కళాసిగూడ నల్లగుట్ట జంక్షన్ మీదుగా వెళుతున్న నాలాను 2.85 మీటర్ల నుంచి 4.3 మీటర్లకు విస్తరించాలి
* మహాత్మాగాంధీరోడ్‌లో ఉన్న నాలాను 3 నుంచి 5.5 మీటర్లకు విస్తరించాలి
* వారాసీగూడ బ్రిడ్జికి ఆనుకొని ప్రవహిస్తున్న నాలాను 3.5 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరించాలి
 
డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్...
చారిత్రక హైదరాబాద్ నగర జనాభా 1925 నాటికి 4.47 లక్షలు మాత్రమే. ఇళ్లు, కుటీర పరిశ్రమల నుంచి వెలువడేమురుగు నీటిని మూసీలో కలిపేందుకు 1931లో మాస్టర్ ప్లాన్‌ను విశ్వేశ్వరయ్య సిద్ధం చేశారు. నాటి అవసరాల మేరకు నగరంలో సుమారు 700 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ సదుపాయం సమకూరింది. డ్రైనేజీ వ్యవస్థను రూ.14,03,500 ఖర్చుతో పూర్తి చేశారు.
చరిత్రలోకి ఒకసారి..
1908లో మూసీ వరద పోటెత్తింది. విశ్వేశ్వరయ్య 1910, 1912 ప్రాంతంలో మూసీ ఎగువ ప్రాంతంలో పర్యటించారు. భారీ వర్షాలు కురిసినపుడు 4,25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం మూసీలో చేరుతుందని లెక్కగట్టారు. ఉస్మాన్‌సాగర్(గండిపేట్), దాని పక్కనే హిమాయత్‌సాగర్ జలాశయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో 1920లో గండిపేట్(మూసీ), 1927లో హిమాయత్‌సాగర్ (ఈసీ) జంట జలాశయాల నిర్మాణం జరిగింది. ఈ జలాశయాల్లో నిల్వచేసిన మంచి నీటిని హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు వీలుగా డి జైన్, డ్రాయింగ్ సిద్ధం చేశారు. నీటిని శుద్ధి చేసేందుకు మీరాలం ఫిల్టర్ బెడ్‌కు రూపకల్పన చేశారు. జంట జలాశయాలకు ఫ్లడ్ గేట్లను ఏర్పాటు చేశారు. రాజధానికి వరద తాకిడి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించారు.

మరిన్ని వార్తలు