చేనేత వస్త్రాల ఎగుమతికి కృషి: జూపల్లి

2 Jan, 2016 02:46 IST|Sakshi

నగరంలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాలకు డిమాండ్ పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆన్‌లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల ఎగుమతికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ‘జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో చేనేత ఎగుమతులు పెద్ద ఎత్తున సాగుతున్నాయని, కానీ తెలంగాణలో రూ. 100 కోట్ల విలువైన ఎగుమతులు కూడా లేవని అన్నారు.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేనేత ఉత్పత్తుల విక్రయాల్లో కూడా వినియోగిస్తామని, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వ్యాపార సంస్థల ద్వారా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. ఇక నుంచి నేతన్నలు తయారు చేసిన వస్త్రాల్లో ఆ చీరను తయారు చేసిన వారి ఫొటో వివరాలు ఉంచే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా నేరుగా చేనేత కార్మికుల నుంచే వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్, ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేందర్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు