బీటీ–3పై ఏం చేయాలి?

20 Jan, 2018 01:56 IST|Sakshi

పర్యవసానాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై కేంద్రం ఆరా

సాక్షి, హైదరాబాద్‌: జీవ వైవిధ్యానికి ప్రమాద కరమైన బీటీ–3 పత్తి విత్తనాన్ని ఏం చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన ‘క్షేత్రస్థాయి తనిఖీ, శాస్త్రీయ మూల్యాం కన కమిటీ (ఎఫ్‌ఐఎస్‌ఈసీ)’పరిశీలన ము మ్మరం చేసింది. పత్తి అధికంగా సాగుచేసే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్‌లలో.. అనుమతిలేని బీటీ–3 విత్తనం ఏమేరకు వ్యాప్తి చెందిందో అధ్యయనం చే స్తోంది. అందులో భాగంగా 12 మంది సభ్యుల బృందం గురు, శుక్రవారాల్లో తెలం గాణలోని గద్వాల, మంచిర్యాల, వికా రాబాద్‌ జిల్లాల్లో పర్యటించింది.

రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కె.కేశవు లు నేతృత్వంలో రైతులను కలసి విచారించిం ది. ఆయా జిల్లాల్లో పత్తి పంటలను, జిన్నింగ్‌ మిల్లులను, విత్తన శుద్ధి ప్లాంట్లను పరిశీలిం చి, విత్తన నమూనాలను సేకరించింది. బీటీ–3కి అనుమతి లేకున్నా పలు చోట్ల ఆ విత్తనాన్ని వేశారని గుర్తించింది. అనంతరం హైదరాబాద్‌లో విత్తన కంపెనీలు, డీలర్లు, విత్తనోత్పత్తిదారులతో సమావేశమైంది. 


దిశా నిర్దేశం చేయండి

అనధికార, పర్యావరణ కాలుష్య కారకమైన బీటీ–3 పత్తి విత్తనాలను అరికట్టడంపై స్పష్టమైన నిబంధనలతో అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర బృందాన్ని కోరారు. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఆ విత్తనాలను క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కొన్నేళ్లుగా అనధికార బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని జాతీయ, రాష్ట్ర విత్తన సంఘాల ప్రతినిధులు, విత్తనోత్పత్తిదారులు కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. అనధికార పత్తి విత్తనాలను పూర్తిగా నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

కొందరు విత్తనోత్పత్తిదారులు చేసిన తప్పులకు విత్తన డీలర్లు ఇబ్బందులపాలు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించటానికి తగిన నిబం ధనలు రూపొందించాలని.. విత్తనాల గుర్తిం పుపై డీలర్లకు, రైతులకు శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి కావలసిన పత్తి విత్తనాల్లో 40 శాతం వరకు రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నామని.. అనుమతి లేని బీటీ–3 పత్తి విత్తనాల వల్ల వాతావరణం కలుషితమవుతుందని రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కె.కేశవులు పేర్కొన్నారు. బీటీ–3 పత్తిలో హెచ్‌టీ లక్షణాన్ని కనుగొని విత్తన ధ్రువీకరణ చేయటానికి ప్రైవేటు పత్తి సంకరజాతి రకాల నోటిఫికేషన్‌ అడ్డంకిగా ఉందని కేంద్ర ప్రభుత్వ జీవ సాంకేతిక విభాగం ముఖ్య శాస్త్రీయ అధికారి వి.ఎస్‌.రెడ్డి చెప్పారు.

కేంద్ర బృందానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలివీ..

1. చట్టవిరుద్ధ బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిని, అమ్మకాలను నియంత్రించే చర్యలు చేపట్టాలి.
2. అన్ని రాష్ట్రాల లాఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీలు చేపట్టాల్సిన తక్షణ చర్యలను గుర్తించి మార్గదర్శకాలు రూపొందించాలి.
3. బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిపై, గ్లైఫోసేట్‌ అమ్మకాలపై పర్యవేక్షణకు మార్గదర్శకాలు రూపొందించాలి.
4. విత్తన ఉత్పత్తిదారుల వద్ద లేదా ప్రొసెసింగ్‌ ప్లాంట్లలో బీటీ–3 పత్తి విత్తనాలను తనిఖీ చేసి వెంటనే నాశనం చేసేలా విధివిధానాలు రూపొందించాలి.
5. బీటీ–3 పత్తి వాడకం, గ్లైఫోసేట్‌ దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి. 
6. బీటీ–3లో హెచ్‌టీ లక్షణం పరీక్ష కోసం ప్రొటోకాల్స్‌ రూపొందించాలి. 

మరిన్ని వార్తలు