బార్లపై ఇదేం బాదుడు!

13 Jun, 2016 03:56 IST|Sakshi
బార్లపై ఇదేం బాదుడు!

- బార్ల అసోసియేషన్ ఆందోళన
- లెసైన్సు, రెన్యూవల్ ఫీజుల పెంపు, సిట్టింగ్ కెపాసిటీని బట్టి రుసుము వసూలుకు ఆబ్కారీ శాఖ ప్రతిపాదన
- నేడు ఎక్సైజ్ కమిషనర్‌ను కలసి నిరసన
 
 సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీశాఖ ప్రతిపాదనలపై బార్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల రూపేణా బాదడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న ‘నూతన బార్ పాలసీ’లో భాగంగా ఫీజులను పెంచాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదించింది. ప్రతి రెండేళ్లకోసారి ఇష్టానుసారంగా లెసైన్సు ఫీజులు, రెన్యూవల్ దరఖాస్తు ఫీజు ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని తెలంగాణ రెస్టారెంట్, బార్ల అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో లెసైన్సు, రెన్యూవల్ దరఖాస్తు ఫీజుల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకించాలని యజమానులు నిర్ణయించారు. ఈ ఫీజులతోపాటు సీటింగ్ కెపాసిటీ ఆధారంగా రుసుము వసూలు చేస్తే ఆ భారం వినియోగదారులపైనే పడుతుందని, మద్యం ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఐదేళ్లలో రూ.2 నుంచి లక్షకు పెంపు
 ఐదేళ్ల క్రితం వరకు రెండు రూపాయల రెవెన్యూ స్టాంప్‌తో బార్ లెసైన్స్ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకొనేవారు. తరువాత దీనిని ఆబ్కారీ శాఖ రూ.10 వేలకు పెంచింది. ఈసారి ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది. 804 బార్ల రెన్యూవల్ దరఖాస్తు ఫారాల విక్రయం ద్వారానే రూ.8 కోట్లకుపైగా వసూలు చేయాలని నిర్ణయించింది.
 
 లెసైన్సు ఫీజు, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా ఫీజుల పెంపు
 జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయితీల్లో కూడా 10 శాతం వరకు లేదా రూ.5 లక్షల మేర లెసైన్సు ఫీజు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బార్ల వైశాల్యం, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా 500 చదరపు మీటర్లు దాటితే ప్రతి 200 మీటర్లకు 10 శాతం చొప్పున రుసుము వసూలు చేయాలని కూడా భావిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే బార్ల నిర్వహణ సాధ్యం కాదని యజమానులు పేర్కొంటున్నారు. కాగా సోమవారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాలను కలసి పరిస్థితిని వివరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు తిరిగి రాగానే ఫీజుల పెంపుపై విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు