ఇదేమి ఔషధ మాయ..?

25 Jan, 2016 04:49 IST|Sakshi
ఇదేమి ఔషధ మాయ..?

(మంథా రమణమూర్తి)

పక్కన వేరే వాళ్లుంటే సొంత ఇంట్లో కూడా కళ్లు మూసుకుని నిద్రపోలేం. కానీ డాక్టరు పరీక్ష చేసినా, చికిత్స చేసినా ఆయన ముందు నిశ్చింతగా కళ్లు మూసుకుంటాం! బయటికెళ్తే మంచి నీళ్లు తాగటానికి వెనకాడేవారు సైతం.. డాక్టరు రాసిన మందును క్షణాల మీద వేసుకుంటారు. ఎందుకంటే.. వైద్యం ఒక అవసరం. వైద్యుడొక నమ్మకం! ఈ నమ్మకాన్నిపుడు పూర్తిగా ధన దాహం కమ్మేసింది.

 

చికిత్స చేసే వైద్యుడి నుంచి, పరీక్షలు చేసే సెంటర్లు, మందులమ్మే షాపులు అన్నిటినీ ‘నాకేంటి?’ అనే వ్యాపారసూత్రమే నడిపిస్తోంది. అందుకే.. తక్కువ ధరకు దొరికే జనరిక్ మందులన్నీ బడా బ్రాండ్ల ముందు వెలవెలబోతున్నాయి. వీటిని కొంటే రోగికి నాలుగు డబ్బులు మిగిలే అవకాశం ఉన్నా... కొనిపించే వ్యవస్థ మాత్రం కరువవుతోంది. ఈ అవ్యవస్థలో ఎవరి పాత్ర ఎంతో తెలియజేసే ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు నేటి నుంచి.. 

 

- జనరిక్ మందులతో రోగుల ఖర్చు మూడొంతులకు పైగా ఆదా

- ప్రత్యేక షాపుల ద్వారా విక్రయానికి ప్రభుత్వం యత్నాలు

- కానీ వీటివల్ల తమ కమీషన్లు పోతాయని ఆసుపత్రులు, వైద్యుల భయం

- నాసిరకానివని చెబుతూ విక్రయాలకు అడ్డుపుల్ల

- మన దేశంలో తయారవుతున్నవన్నీ జనరిక్ మందులే

- కొన్నింటికి మాత్రం రిప్రజెంటేటివ్‌లు, డాక్టర్ల ద్వారా ప్రచారం

- ఆ ఖర్చులన్నీ మందుపైనే.. దాంతో ఆకాశాన్నంటుతున్న ధర

- అదే మందు ప్రచారం లేకుండా షాపుల్లో విక్రయిస్తే తక్కువ ధర

- కానీ కమీషన్లు, గిఫ్ట్‌లు ఇచ్చిన కంపెనీలకే వైద్యులు, యాజమాన్యాల వత్తాసు

- మందుల బ్రాండ్ పేరు బదులు ఔషధం పేరే రాయాలని గతంలోనే ఎంసీఐ ఆదేశాలు.. అయినా పట్టించుకోని వైద్యులు

 

ప్రకాశ్‌కు బీపీ, షుగర్ రెండూ ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా మందులు వాడుతున్నాడు. జీవితాంతం వాడాలి కూడా. మొదట్లో మందులకు నెలకు రూ.2 వేల దాకా అయ్యేది. భారం కావటంతో ఓసారి ఫార్మా డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న స్నేహితుడికి చెప్పాడు. ఆయన జనరిక్ దారి చూపించాడు. అచ్చంగా ప్రకాశ్ కొంటున్న మందుల్లో వాడే ఔషధాలనే వాడుతూ... ఇతర కంపెనీలు తయారు చేస్తున్న మందుల్ని సూచించాడు. వాటిని తక్కువ ధరలకే విక్రయించే మెడికల్ షాపులూ దొరకటంతో ప్రకాశ్‌కు ఇప్పుడు నెలకు రూ.2 వేల బదులు రూ.600 మాత్రమే ఖర్చవుతోంది. అలా ప్రకాశ్ మందుల ఖర్చులు దాదాపు 70 శాతం ఆదా అయ్యాయి.
దినకర్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) తీవ్రం కావటంతో దీర్ఘకాలం మందులు వాడాల్సి వచ్చింది. డాక్టర్లు రాసిన మందులకు నెలకు రూ.4 వేల పైనే ఖర్చు కావటంతో... బ్రాండ్‌పేరున్న జనరిక్స్‌కు బదులుగా పెద్దగా బ్రాండ్ పేరు లేని జనరిక్ మందులను ఆశ్రయించాడు. దీంతో నెలకు రూ.వెయ్యి మాత్రమే ఖర్చువుతోంది. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు దినకర్. ఈ రెండు కేసుల్లోనూ తేలిందేమిటంటే.. మందులు మార్చినా వ్యాధి తగ్గటంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. బ్రాండెడ్ జనరిక్స్ ఎలా పని చేస్తాయో... బ్రాండ్ లేని జనరిక్స్ కూడా అలానే పనిచేశాయి.

 మందుల్లో ధన దాహమెందుకు?
 కార్పొరేట్ల రాకతో వైద్య ఖర్చులు అమాంతం పెరిగాయి. డాక్టరు, ఆస్పత్రుల ఫీజులు చెల్లించేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి. మరి మందుల సంగతో..? చిత్రమేంటంటే వీటికి బీమా కవరేజీ కూడా వర్తించదు. మన దేశంలో డాక్టర్లు రాసిన మందులు కొనలేక రోగాన్ని దేవుడికే వదిలేసిన ప్రాణాలు తక్కువేమీ కాదు. ఓవైపు ఆస్పత్రుల బిల్లు, కన్సల్టేషన్ ఫీజులంటూ రోగుల్ని బాదేస్తూ మరోవైపు మందుల్లోనూ అంత దాహమెందుకు? తక్కువ ధరకే దొరికే జనరిక్ మందులు సిఫారసు చేయొచ్చుగా? ఇదే ప్రశ్న ఆస్పత్రులనడిగితే...? డాక్టర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు కనుక వారు ఏ మందులు రాస్తారన్నది తమ చేతుల్లో ఉండదని చెబుతున్నాయి.

మరి డాక్టర్లేమో... రోగుల ఆరోగ్యం తమ చేతుల్లో పెడతారు కనుక నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని, ఏ కంపెనీవి పడితే ఆ కంపెనీ మందులు సిఫారసు చేయలేమని చెబుతున్నారు. నిజంగా మీవి నాణ్యత లేని మందులా? అని ఫార్మా కంపెనీలనడిగితే.. మందుల తయారీకి ప్రతి కంపెనీ నిబంధనల్ని పాటిస్తుందని, అలా పాటించకపోతే లెసైన్సులు రద్దవుతాయని, అందుకని నాణ్యత తక్కువుండే ప్రసక్తే లేదని చెబుతున్నాయి. కాకుంటే తాము డాక్టర్లకు బహుమతులు, రిప్రజెంటేటివ్‌ల ఖర్చులు పెట్టం కనుక తక్కువ ధరకు ఇవ్వగలుగుతామని చెబుతున్నాయి. నాణ్యత లేకుంటే తామెందుకు అనుమతులిస్తామనేది ప్రభుత్వం తరఫున కూడా ఎదురు ప్రశ్నే!! వైద్యులను నేరుగా మందుల పేర్లు రాయకుండా సాధ్యమైనంత వరకూ జనరిక్ పేర్లనే రాయమంటున్నామని, ఈ మేరకు రెండు దఫాలు ఆదేశాలు కూడా ఇచ్చామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) కూడా స్పష్టంగా చెబుతోంది.
 
 ఎవరి ‘లెక్క’ వారిది..
 ఈ మొత్తం వ్యవహారంలో ఏ ఒక్కరిదీ తప్పున్నట్టు అనిపించదు. చట్టం మాదిరి అంతా తమ పని తాము చేసుకుపోతున్నారనిపిస్తుం ది. కానీ లోతుగా చూస్తే అసలు గుట్టు బయటపడుతుంది. మందుల నాణ్యతను నియంత్రించే ప్రభుత్వం.. అన్నీ జనరిక్‌లే అయినపుడు ఒకే జనరిక్ మందుకు ఇన్ని రకాల ధరలెందుకున్నాయని ఎన్నడూ ప్రశ్నించదు. అలా ప్రశ్నిస్తే ఇలా ధరల్లో తేడా ఉండదుగా! ఒక మందుకు ఒకే ధర అనేది బహుశా ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుందేమో! ధరలపై ఎలాగూ నియంత్రణ లేదు. బడా ఫార్మా సంస్థలకేమో లాభాలు కావాలి. మందులకు బహిరంగంగా ప్రచారం చేయకూడదు కనుక ఆ పనిని డాక్టర్ల ద్వారా చేయిస్తుంటాయి. ప్రచారానికి వెచ్చించాల్సిన సొమ్మును డాక్టర్ల విదేశీ పర్యటనలకు, ఖరీదైన బహుమతులకు వెచ్చిస్తుంటాయి.

ఆ కంపెనీ బాగుంటేనే తమ బాగు కనుక డాక్టర్లు, ఆస్పత్రులు సైతం యథాశక్తి ఆ బ్రాండ్‌నే రాస్తారు. చౌకగా దొరికే ఇతర జనరిక్‌ల జోలికి వెళ్లరు. మెడికల్ షాపులేమో డాక్టర్లు రాసిన మందులు లేకపోతే కొన్ని సందర్భాల్లో జనరిక్‌లు ఇస్తూ ఉంటాయి. డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ జనరిక్స్‌పై ముద్రించిన రేటుకే ఇస్తాయి. అది చాలా ఎక్కువుంటుంది. బ్రాండ్ లేని జనరిక్‌లకు కంపెనీలు అంత రేటు పెట్టకూడదు. కానీ డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్ ఉండదు.. మందుల షాపులవాళ్లు తామే చొరవతో వాటిని అమ్మాలి కనుక వాటికి 70-80% లాభాలివ్వటానికి అంత రేటు పెడతారు. అంతిమంగా నష్టపోతున్నది మాత్రం రోగే. ఒకవైపు వ్యాధి, మరోవైపు వీళ్లందరి దాహానికి బలవుతున్నది వినియోగదారుడే.
 
 జనరిక్ మందులు అంటే?
 ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలోని కంపెనీలు తయారు చేసి విక్రయిస్తున్నవన్నీ జనరిక్ మందులే. సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా వంటి దేశీ దిగ్గజాలు తయారు చేస్తున్న మందులన్నీ జనరిక్‌లే. ఎందుకంటే ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇప్పటిదాకా సొంత మందు ఒక్కటి కూడా ఆవిష్కరించలేదు. ఇవి తయారు చేస్తున్న మందులన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఓ విదేశీ కంపెనీ కనుగొన్నదే. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో అందులోని ఔషధాల్ని వేరు చేసి.. అదే మోతాదులో ఈ కంపెనీలు సొంత మందులు తయారు చేస్తాయి. వాటినే జనరిక్ మందులుగా పిలుస్తారు.
 
 జనరిక్స్ కానివేంటి?
 ఫార్మా కంపెనీలు వివిధ వ్యాధులకు మందులు తయారు చేయడానికి సొంతంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాల్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొన్నేళ్లపాటు అధిక వ్యయ ప్రయాసలకోర్చి.. ట్రయల్స్ వంటివి నిర్వహించి చివరికి మందును కనుగొని, దానికి అనుమతులు సంపాదిస్తాయి. ఆ కంపెనీ సదరు మందు కోసం అప్పటికే బోలెడంత డబ్బు వెచ్చించి ఉంటుంది కనుక ఆ మందుపై దానికి పేటెంట్ హక్కులుంటాయి. సాధారణంగా ఈ హక్కులు 20 ఏళ్లపాటు ఉంటాయి. 20 ఏళ్లు ముగిసే వరకూ ఆ కంపెనీ ఒక్కటే దాన్ని తయారు చేస్తుంది. దాని ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్లలోగా ఏదైనా ఇతర కంపెనీ ఆ మందును తయారు చేయాలంటే.. కనుగొన్న కంపెనీకి రాయల్టీ ఇవ్వాలి. కానీ 20 ఏళ్లు ముగిశాక పేటెంట్ హక్కులు పోతాయి. అప్పుడు ఏ కంపెనీ అయినా దాన్ని తయారు చెయ్యొచ్చు. అదే జనరిక్. ఇండియాలో కంపెనీలన్నీ తయారు చేస్తున్నవి ఇవే. 20 ఏళ్ల తర్వాత దాన్ని కనుగొన్న కంపెనీ కూడా.. పోటీ ఉంటుంది కాబట్టి ధర తగ్గించేస్తుంది. అప్పటికే అది ఆ మందుపై పెట్టిన ఆవిష్కరణ ఖర్చుల్ని రాబట్టుకుంటుంది.
 
 జనరిక్స్‌ను తెలుసుకోవటమెలా?
 ఒక మందుకు తక్కువ ధరలో ఇంకా ఏయే జనరిక్స్ దొరుకుతున్నాయో తెలుసుకోవటం ఎలా? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఇప్పుడు చాలా మందుల షాపుల్లో... కంప్యూటర్లో ఒక మందు ఎంటర్ చెయ్యగానే దానికి ప్రత్యామ్నాయ మందులేంటన్నది చెప్పే సాఫ్ట్‌వేర్ ఉంది. 1ఎంజీ డాట్ కామ్, జనరిక్‌వాలా డాట్ కామ్... ఇంకా పలు వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్లో వాడటానికి 1ఎంజీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒక మందు పేరును ఎంటర్ చెయ్యగానే... అది ఎందుకు పనిచేస్తుంది? సైడ్ ఎఫెక్ట్‌లు ఉన్నాయా? ఆ మందులో ఏఏ ఔషధాలుంటాయి? ధర ఎంత? దానికి ప్రత్యామ్నాయ మందులేంటి? వాటి ధరలెంత? ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి. ప్రతి మందునూ ఏ కంపెనీ తయారు చేసిందో కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి మందులు కొనుక్కోవచ్చు.

మరిన్ని వార్తలు