మద్యంపై ఎమ్మార్పీ.. విద్యకేదీ ఎమ్మార్పీ?

12 Jun, 2016 02:07 IST|Sakshi
 •      స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో పోరుబాట
 •      ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా
 •      తల్లిదండ్రులు, వలంటీర్లు, విద్యార్థి నేతలు భారీగా హాజరు
 •      స్కూళ్ల దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ధ్వజం
 •      ఫీజు నియంత్రణ చట్టాలు, జీవోల అమలుకు డిమాండ్
 •      లేకుంటే ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ
 •  
    ‘‘స్కూళ్లా.. పుస్తకాల దుకాణాలా, ఇంజనీరింగ్‌కు రూ. లక్ష.. ఎల్‌కేజీకి రూ. 3 లక్షలా? సేవ ముసుగులో విద్యా వ్యాపారమా?’’
   ‘‘యాజమాన్యాలకు బెంజ్ కార్లు.. తల్లిదండ్రులకు గంజి నీళ్లా?’’
   ‘‘మేనిఫెస్టోలో పెట్టారు.. అమలు చేయడం మరిచారు.. మద్యంపై ఎమ్మార్పీ.. విద్యకేది ఎమ్మార్పీ?’’
   - ప్రైవేటు స్కూళ్ల ఫీ‘జులుం’పై కడుపు మండిన  తల్లిదండ్రులు సూటిగా సంధించిన ప్రశ్నలివీ..

   
   
  సాక్షి, హైదరాబాద్:
  ఏటేటా పెరిగిపోతున్న ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందాపై తల్లిదండ్రులు దండెత్తారు. స్కూళ్ల ధనదాహానికి నిరసనగా రాజధాని హైదరాబాద్‌లో కదంతొక్కారు. స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. తల్లిదండ్రులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు, విద్యార్థి సంఘాల నేత లు అధిక సంఖ్యలో హాజరై ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటాన్ని ప్రశ్నించారు. ఇదేం దోపిడీ అంటూ నినాదాలు చేశారు.  తెలుగు రాష్ట్రాల్లో టెక్సాస్ ఫీజులా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

  ఫీజుల నియంత్రణ కోసం వచ్చిన చట్టాలు, జీవోలు అమలయ్యే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే కొంతవరకు ప్రైవేటు దోపిడీని అరికట్టవ చ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ చైర్‌పర్సన్ అరవింద జాటా, ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ, హెచ్‌ఎస్‌పీఏ విక్రాంత్, ఆశిష్, సుబ్రమణ్యం, రవికుమార్, డాక్టర్ వినయ్‌కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

  స్టిక్కర్ ఆవిష్కరణ..
   ‘సీఎం సార్.. దయచేసి స్కూల్ ఫీజుల దోపిడీని అరికట్టండి’ అనే స్టిక్కర్‌ను హెచ్‌ఎస్‌పీఏ ప్రతినిధులు ఆవిష్కరించారు. వాహనాలకు వాటిని అంటిస్తూ ఫీజు దోపిడీని వివరించారు.

  మరో విప్లవానికి దారితీస్తుంది..
   స్కూలు ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు రోడ్డెక్కడం విద్యావ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని చెప్పడానికి నిదర్శనమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వ్యాఖ్యానించారు. ‘మహాధర్నా’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఫీజు ఉద్యమం మరో విప్లవానికి దారి తీస్తుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని తల్లిదండ్రులు పోరాడుతున్నా చేతగాని దద్దమ్మలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ‘దొంగలందరూ కలసి తల్లిదండ్రుల బలహీనతలను వాడుకుంటూ ఇష్టారాజ్యంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వమూ వత్తాసు పలుకుతోంది. ఫీజు దోపిడీ సాగించే స్కూళ్లన్నీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలవే. ఇందులో సీఎంకూ భాగస్వామ్యం ఉంది’ అని ఆరోపించారు.
   
   ఓ తల్లి ఆవేదన...

   ‘‘నేను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. జీతం నెలకు రూ. 25 వేలు. రెండేళ్ల కిందట ఓ పెద్ద స్కూల్లో మూడో తరగతి చదువుతున్న నా కుమారుడికి రూ. 60 వేల ఫీజు కట్టా. నాలుగో తరగతికి వచ్చే సరికి మరో రూ. 15 వేలు పెంచారు. ఇదేమని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అంతేనంటూ సమాధానమిచ్చారు. ఈ ఏడాది మరో రూ. 10 వేలు పెంచారు.  ఇవన్నీ చెల్లించాలంటే ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి’’  - శారద, (ప్రైవేటు ఉద్యోగిని)
   
   వైఎస్ తెచ్చిన జీవో అమలు చేయాలిwhere is restriction on private schools fees
   2009లో అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెచ్చిన జీఓ నం 91ను అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ జీవోను పాలకులు విస్మరించడం మూలంగానే ప్రైవేటు స్కూళ్లు యథేచ్ఛగా ఫీజు దోపిడీని సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఫీజులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఐటీ సెల్ అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ సాగిస్తూ తల్లిదండ్రుల ఇళ్లల్లో మట్టికొడుతున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య దుయ్యబట్టారు. బడుల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యను వ్యాపారం చేయడానికి వీల్లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం విమర్శించారు.    
   

మరిన్ని వార్తలు