విపత్తుకేదీ విరుగుడు?

21 Jan, 2016 05:32 IST|Sakshi
విపత్తుకేదీ విరుగుడు?

ముంపు ముంగిట నగరం.. మేల్కోవాలి నాయక గణం
 
 కుంభవృష్టి కురవకపోయినా.. 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం కురిసినా నగరం మునిగిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక విపత్తు వస్తే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాలు ఓవైపు ఆక్రమణలకు గురై.. మరోవైపు చెత్తాచెదారం నిండిపోవడంతో వరద నీరు వెళ్లలేని దుస్థితి నగరానిది. సిటీలో సుమారు వంద నీట మునిగే(వాటర్ లాగింగ్) ప్రాంతాలున్నట్లు బల్దియా గుర్తించినా.. నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. రాష్ట్ర గవర్నర్ నివాసముండే రాజ్‌భవన్, అసెంబ్లీ, అమీర్‌పేట్ మైత్రీవనం, ఖైరతాబాద్ తదితర ప్రధాన ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళికలు గానీ, చేసిన పనులు గానీ లేవంటే అతిశయోక్తి కాదు.
 
 కాగితాలపైనే నివేదికలు...
 2000 ఆగస్టులో కురిసిన వర్షాలకు నగరం జలమయమైంది. నీరు వెళ్లే మార్గం లేకపోవడం, వరదనీటి కాలువల్లో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు, ఇంకుడు గుంతలు లేకపోవడం, నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురవ్వడమే దీనికి కారణమని నిపుణులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించే బాధ్యత కిర్లోస్కర్ కన్సల్టెంట్‌కు అప్పగించారు. 2003లో నివేదిక సమర్పించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివద్ధి చేయాలని సూచించింది. దీనికి దాదాపు రూ.264 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూసేకరణ, పునరావాసాలకు అదనపు నిధులు అవసరమవుతాయని భావించారు.

మేజర్ నాలాల అభివద్ధికి కిర్లోస్కర్ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రోలెవల్ వరకు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కమిటీ కి సూచించారు. 2007లో నగరం గ్రేటర్‌గా ఏర్పటయ్యాక ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్‌వర్క్ ప్లాన్, మేజర్, మైనర్ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దీని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్‌లో వరద నీటి సమస్య పరిష్కారానికి రూ.6,247 కోట్లు అవసరమవుతాయి.

ఈ నిధులతో బల్కాపూర్, కూకట్‌పల్లి, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు, ముర్కినాలాలను ప్రక్షాళన చేసి, ఆక్రమణలు నిరోధించాలి. వీటితో పాటు దండు మాన్షన్, గాంధీనగర్, మోడల్‌హౌస్, జలగం వెంగళరావు పార్కు ప్రాంతాల్లో  టన్నెలింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఈ నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.
 
 చతుర్విద ప్రక్రియతో జలసిరి..
 నగరంలోని పార్కులు, లోతట్టు ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఒక్కటి చొప్పున భారీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి.
 ఇవి 22 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల లోతులో ఉండాలి. వీటిపై రంధ్రాలున్న సిమెంట్ జాలి, చెత్తాచెదారం చేరకుండా సిల్టు ట్రాపు మూతలు ఏర్పాటు చేయాలి. దీంతో సమీప బోరుబావులు రీఛార్జ్ అయి జలసిరి సంతరించుకుంటాయి. ఇలా చేస్తే 80 శాతం వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ముంపు సమస్యలనూ అధిగమించొచ్చు. వీటి ఏర్పాటుపై జలమండలి, జీహెచ్‌ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు దృష్టి సారించాలి.
 - హనుమంతరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్, రిటైర్డ్
 
 ఆధునీకరించాలి..  
  లక్ష్మి, వివేకానందనగర్
 నాలాల విస్తరణ చేపట్టాలి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నాలాలు కబ్జాలకు గురయ్యాయి. వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన నాలాల్లో ప్రస్తుతం రసాయన జలాలు, డ్రైనేజీ పారుతోంది. చెత్తాచెదారాలు నిండిపోయాయి. దీంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక వరద ఇళ్లలోకి వస్తోంది. ఇళ్లలోకి నీరు చేరి విష సర్పాలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. నాలాలు ఆధునీకరించి అభివృద్ధి చేసే వారికే నా ఓటు.
 
 అక్రమార్కులపై చర్యలేవీ?
  లావణ్య, కుత్బుల్లాపూర్
 కుత్బుల్లాపూర్‌లో 6 కిలో మీటర్ల మేర నాలా విస్తరించి ఉంది. సుమారు 30 ఫీట్ల నాలా 15 ఫీట్లకు కుంచించుకుపోయింది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. ఆక్రమణలు జరుగుతున్నా అడ్డుకోకపోవడంతో నాలాలను ఆనుకొని బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. గతంలో అధికారులు పలు నిర్మాణాలు అక్రమమని తేల్చారు. కానీ చర్యలు తీసుకోలేదు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే నాయకులకే పట్టం కడతాం.  
 
 నాలాల నిర్వహణేదీ..?
  ఈఎస్ ధనుంజయ, అంబర్‌పేట
 అధికారులు నాలాల నిర్వహణ మరిచారు. ‘నామ్‌కే వాస్త్’గా నాలాల పూడికతీత తీసి, నిధులు దండుకుంటున్నారు. మరోవైపు నాలాలు ఆక్రమణలకు గురై కుంచించుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. నాలాల చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని ఎన్నికల వేళ నాయకులు హామీలిస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదు. హామీలు నెరవేర్చే వారినే గెలిపించాలి.
 
 చినుకొస్తే నగరం చిగురుటాకే.. కుంభవృష్టి కురిస్తే క‘న్నీటి’ సంద్రమే.. రహదారులు జలమయమే. రాకపోకలు రణరంగమే.. నిలువ నీడ లేక బస్తీలకు నిత్య కష్టమే.. ‘కబ్జా’ సర్పం పడగవిప్పి.. నీరు వెళ్లే దారి లేకుండా నాలాలను ఆక్రమించిన నరకమిది. నివేదికలు కాగితాలకే పరిమితమై.. వరద నీరు నగరాన్ని వణికిస్తున్న చిత్రమిది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, అక్రమార్కుల ఆగడాల ఫలితమే ఈ దుస్థితి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ను ముంపు ముప్పు నుంచి గట్టెక్కించే పార్టీకే పట్టం కడతామంటున్నారు నగరవాసులు.  
 ..: సాక్షి, సిటీబ్యూరో , కుత్బుల్లాపూర్
 
 ‘మెట్రో’ల్లో భేష్
 ముంబై, బెంగళూర్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రో నగరాల్లో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసిన విపత్తు స్పందనా దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) అందుబాటులో ఉంది. ఇందులో ఆయా నగరపాలక సంస్థలు, జలబోర్డులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపత్తు నిర్వహణ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. విపత్తు సంభవించినప్పుడు సంస్థ సభ్యులు ఆయా విభాగాలను అప్రమత్తం చేసి, సుశిక్షితులైన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపడతారు. కానీ నగరంలో ఇలాంటి ప్రత్యేక విభాగం లేదు.
 
 సిటీలోనూ ఇవి అవసరం

 
► నగరంలోనూ విపత్తు స్పందనా దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేయాలి.
► సిటీలోని పురాతన భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి.
► నాలాలు, లోతట్టు ప్రాంతాలను జీఐఎస్ పరిజ్జానం ద్వారా గుర్తించి మ్యాపులు సిద్ధం చేయాలి.
► లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాల ఏర్పాటు
► ముప్పు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించకుండా అత్యవసర మోటార్లు ఏర్పాటు చేయాలి.
►  ప్రతి నాలా చుట్టూ వలయం నిర్మించాలి.
 
 ప్రతిపాదనలకే పరిమితం...

 నాలాల ఆధునీకరణకు రూ.10 వేల కోట్లు ఖర్చవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రతిపాదించారు. తొలిదశలో 390 కి.మీ.ల మేర నాలాలను అభివద్ధి చేయాలని గతేడాది నవంబర్‌లో భావించారు. దశల వారీగా పనులు పూర్తి చేయాలని, ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమిస్తామని ప్రకటించారు. నేటికీ ఆచరణలోకి రాలేదు.
 
 ఇవిగో పరిష్కార మార్గాలు..
► ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.
► బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి.
► నిర్ణీత వ్యవధిలో పనుల పూర్తికి ప్రత్యేక విభాగం ఏర్పాటు
► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి. దీనికి పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి.
► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన
► ఆదేశాలివ్వాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి.
► అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
► చెరువులు పునరుద్ధరించాలి.

>
మరిన్ని వార్తలు