ఏ కమిషరేట్ కావాలి?

7 Jun, 2016 00:56 IST|Sakshi
ఏ కమిషరేట్ కావాలి?

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విభజన వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఉన్నతాధికారులు ఇప్పుడు ఉద్యోగుల పంపకాలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఎవరెవరు ఏ కమిషనరేట్‌లకు వెళతారని రెండు రోజుల నుంచి ఉన్నతాధికారులు సిబ్బంది నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. స్పెషల్ బ్రాంచ్, మినిస్టీరియల్ స్టాఫ్, సెక్యూరిటీ వింగ్, బాంబు నిర్వీర్య బృందాలు, సెక్యూరిటీ, ఆర్డ్మ్ పోలీసు విభాగాల సిబ్బందిని  ఈస్ట్ లేదా వెస్ట్  ఆప్షన్ ఎంచుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. శాంతిభద్రతల విభాగంలో పని చేస్తున్న వారితో పాటు మిగతా ఫోర్స్ మాత్రం యధావిధిగా ఎక్కడ ఉన్నా వారు అక్కడే విధులు నిర్వర్తించనున్నారు.  
 
ఈస్ట్ జోన్‌లోకి పహాడీషరీఫ్ ఠాణా...
ఈస్ట్ కమిషనరేట్‌లోకి ఎల్‌బీనగర్ జోన్ మొత్తం రానుండగా, మల్కాజిగిరి జోన్‌లోని అల్వాల్ పోలీసు స్టేషన్ మినహా మిగిలిన ఠాణాలన్నీ చేర్చాలని నిర్ణయించారు. అయితే శంషాబాద్ జోన్‌లోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌ను ఎల్బీనగర్ జోన్‌లోకి చేరుస్తూ ఈస్ట్‌లో కలపాలని భావిస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి చౌటుప్పల్, భువనగిరి రూరల్ అండ్ టౌన్, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, బొమ్మాలరామారం పోలీసు స్టేషన్లు,  భువనగిరి ట్రాఫిక్.... చౌటుప్పల్ ట్రాఫిక్ ఠాణాలు కూడా ఈస్ట్‌లో కలుపుతూ చేసిన ప్రతిపాదనను ఇప్పటికే డీజీపీ కార్యాలయంలోని రీ-ఆర్గనైజేషన్ వింగ్ ప్రభుత్వానికి సమర్పించింది.
 
వెస్ట్‌లోకి అల్వాల్ పోలీసు స్టేషన్...
వెస్ట్ కమిషనరేట్‌లోకి శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్‌లు రానున్నాయి. అయితే ప్రస్తుతం మల్కాజిగిరి జోన్‌లో ఉన్న అల్వాల్ ఠాణాను బాలానగర్ జోన్‌లోకి తీసుకువస్తూ వెస్ట్‌లోనే కలపాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.  మెదక్ నుంచి ఆర్‌సీ పురం, రంగారెడ్డి నుంచి శంకరపల్లి, షాబాద్ ఠాణాలు, మహబూబ్‌నగర్ నుంచి షాద్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట్ పోలీసు స్టేషన్లు, షాద్‌నగర్ ట్రాఫిక్ ఠాణాను వెస్ట్ కమిషనరేట్‌లో కలుపుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ విభజనపై ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం... లీగల్, ఫైనాన్స్‌పైనా దృష్టి సారించిందని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు