ఎవరా దుండగులు?

4 Apr, 2015 08:17 IST|Sakshi
ఎవరా దుండగులు?

* సూర్యాపేట కాల్పుల కేసులో కనిపించని పురోగతి
* నిందితుల కోసం
* జల్లెడపడుతున్న పోలీసులు
*యూపీ, ఒడిశాకు వెళ్లిన దర్యాప్తు బృందాలు
*అంతర్రాష్ర్ట ముఠా
* పనేనంటున్న అధికారులు
* కూపీ లాగేందుకు ఇర్ఫాన్‌ను విచారించే అవకాశం

సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల కేసు దర్యాప్తులో పోలీసులకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి సోదాలు జరుపుతున్న పోలీసులపై కాల్పులకు తెగబడి ఓ కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును హతమార్చిన దుండగులను పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం తీవ్రంగా గాలిస్తోంది. ఆక్టోపస్ కమాండోలతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్(ఎస్‌ఐబీ), కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.  ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదు. అయితే ఇది అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పనేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచిపోవడంతో దుండగులు ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతా ల్లో తలదాచుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


దీంతో అధికారులు 2 బృందాలను ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పంపించారు. కాగా, సూర్యాపేట పోలీసులు కొన్ని రోజుల కింద అంతర్రాష్ట దోపిడీ ముఠా నాయకుడు ఇర్ఫాన్, అతని సహచరుడు అక్తర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు అక్కడి జైలులోనే రిమాండు ఖైదీలుగా ఉన్నారు. వీరి అరెస్టు తర్వాతే బస్టాండ్‌లో కాల్పుల ఘటన జరగడంతో ఇందులో ఇర్ఫాన్ ముఠా హస్తముందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దర్యాప్తు అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇర్ఫాన్ ముఠాలో అందరూ వయసు మళ్లిన వారున్నారని, పోలీసులపై దాడి చేసే సామర్థ్యం వారికి లేదని అంటున్నారు. అయితే, అసలు నిందితులను గుర్తించేందుకు ఇర్ఫాన్ సహకారాన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాల సమాచారాన్ని సేకరించేందుకు త్వరలో కోర్టు అనుమతితో ఇర్ఫాన్, అక్తర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.


కాగా, బుధవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జ్యోతిష్యుడు నాగరాజుపై కాల్పులు జరిపిన కిరాయి హంతక ముఠాకూ సూర్యాపేట కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ ఇచ్చే సమాచారంతో కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిద్దరూ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇర్ఫాన్ అరెస్టు తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి స్వస్థలం మీరట్(యూపీ)కు సీఐ మొగిలయ్య వెళ్లి వచ్చినట్లు తెలిసింది.

 

ఈ నేపథ్యంలో ఆయన కోలుకున్నాక కీలక సమాచారాన్ని వెల్లడించే అవకాశముంది. కాగా, ప్రస్తుతం స్థానిక డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) సైతం సమాంతర దర్యాప్తు ప్రారంభించింది. ఎస్‌ఐబీ ఎస్పీ చంద్రశేఖర్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్‌ను సందర్శించి ఘటన జరిగిన తీరును స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. త్వరలో ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాష్ర్ట ప్రభుత్వం అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు