మద్దతు ధరపై ప్రభుత్వం నోరెత్తదేం..

16 Nov, 2016 18:34 IST|Sakshi

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత‍్వం ప్రకటించిన మద్దతు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరెత్తడం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు.  గోధుమ, ఆవాలు, కుసుమ పంటలకు మద్దతు ధరను 8.2 శాతం నుంచి 16 శాతం వరకు పెంచుతూ కేంద్రం తీసుకుందని.. అయితే వరి విషయంలో మాత్రం అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత‍్వం మాట్లాడటం లేదని అన్నారు. గోదుమ కంటే వరికి అయ్యే ఉత్పాదక వ్యయం ఎక్కువగా ఉందని.. రైతులకు ఆదాయం తక్కువగా ఉన్న వరికి గిట్టుబాటు ధరను పెంచే విషయంలో కేంద్రం పట్టించుకోలేదని అన్నారు.

ఎన్డీఏ ప్రభుత‍్వం అధికారంలోకి వచ్చాక ధాన్యానికి మొదటి సంవత్సరం రూ. 50, రెండో సంవత్సరం రూ. 50, మూడో సంవత్సరం రూ. 60(4.2 శాతం) ముష్టి వేసినట్లుగా పెంచినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నాగిరెడ్డి ప్రశ్నించారు. వరి మద్దుతు ధరపై కేంద్రం చూపుతున్న వివక్ష వలన ఆంధ్రప్రదేశ్‌ రైతులే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. ఉత్తరాదిన ఎన్నికలు ఉన్నాయని గోధుమకు ఈ సంవత్సరం రూ. 125 పెంచి, ధాన్యానికి మాత్రం రూ. 60 పెంచడం దక్షిణాది వరి రైతులపై వివక్ష చూపడమే అని ఆయన అన్నారు. ధాన్యానికి క్వింటాలుకు రూ. 300 బోనస్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు