బీబీనగర్‌ నిమ్స్‌ ఎందుకు ప్రారంభించలేదు?

8 Mar, 2018 01:21 IST|Sakshi

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో నిమ్స్‌ ఆస్పత్రి భవనాలు నిర్మించి ఏడేళ్లవుతున్నా నేటి వరకూ వైద్య సేవలు ఎందుకు ప్రారంభించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రూ.125 కోట్లతో నిర్మించిన ఆ భవనాలు ఎందుకు ఖాళీగా ఉంచారో వివరణివ్వాలని నోటీసులు జారీ చేసింది. జర్నలిస్ట్‌ కె.నరేందర్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.

గతంలో మంత్రులు, సీఎం కూడా సర్కారు ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందేవారని.. కానీ ఆస్పత్రుల పరిస్థితి క్షీణించడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. బీబీనగర్‌లో నిమ్స్‌ భవనాలు నిర్మించినా ప్రారంభించకపోవడాన్ని కాగ్‌ తప్పుబట్టినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నాయని, ఆరోగ్యశ్రీలో అక్రమాలు జరుగుతున్నట్లు విజిలెన్స్‌ నివేదికలే చెబుతున్నాయని చెప్పారు. ‘కార్పొరేట్‌’లో రోగులకు మంచి వైద్యం అందించేందుకు వీలుగా అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని వాదించారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ వివరించారు. కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికీ ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు