భర్తను రోకలిబండతో మోది.. భార్య ఆత్మహత్య

3 Aug, 2016 07:49 IST|Sakshi
భర్తను రోకలిబండతో మోది.. భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం
నాలుగేళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న భర్తకు విముక్తి కల్పించాలని..
చంపేందుకు ప్రయత్నించిన భార్య
ఆ తర్వాత 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

హైదరాబాద్: నాలుగేళ్లుగా జీవచ్ఛవంలా పడి ఉన్న భర్తకు విముక్తి కల్పించాలనుకుంది.. ఆయనను చంపేసి బాధల నుంచి తప్పించాలనుకుంది.. ఆయనతోపాటు తానూ తనువు చాలించాలని నిర్ణయించుకుంది.. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న భర్త తలపై రోకలి బండతో మోదింది.. ఆయన చనిపోయాడనుకుని 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.. ఐదు పదులు దాటిన దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఉదంతం మంగళవారం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న మైహోం జ్యువెల్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ విషాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నాలుగేళ్లుగా వ్యాధితో..
రాజమండ్రికి చెందిన మురళీకృష్ణ (65) ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు భార్య వెంకట సాయిలక్ష్మి (56), కుమారులు గణేశ్, ఓంకార్ ఉన్నారు. వారికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరూ మంచి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మురళీకృష్ణ నాలుగేళ్లుగా పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయని స్థితి. లేవడం, కూర్చోవడం, నడవడం కూడా చేయలేరు. భార్య వెంకట సాయిలక్ష్మి అన్నీ తానై భర్తకు సపర్యలు చేస్తోంది. భర్త అలాంటి పరిస్థితిలో ఉండడం భరించలేక పోయింది. తీవ్ర మానసిక వేదనకు గురై.. రెండేళ్లుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తామిద్దరం కలసి చనిపోతామంటూ కుమారులు, బంధువులతో చె బుతూ ఉండే ది.

గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా.. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుందంటూ కుమారులు నచ్చజెప్పారు. అప్పటి నుంచి కొంతకాలం బాగానే ఉన్న సాయిలక్ష్మి.. ఎంతకూ భర్తకు నయం కాకపోవడంతో ఆయనను చంపి, తనూ చావాలని నిర్ణయించుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుర్చీలో కూర్చొని ఉన్న భర్త తలపై రోకలిబండతో గట్టిగా మోదింది. దీంతో మురళీకృష్ణ తలపై పెద్దగాయమై అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. రక్తంతో గది అంతా నిండిపోయింది. ఆయన మరణించాడనుకున్న సాయిలక్ష్మి... తాము ఉండే 13వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. అక్కడిక్కడే మృతి చెందింది. అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికులు అది గమనించి కుమారులకు సమాచారమిచ్చారు. తీవ్ర గాయాలైన మురళీకృష్ణను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు