అడ్డుగా ఉన్నాడని అంతం చేసింది

20 Apr, 2016 12:02 IST|Sakshi
అడ్డుగా ఉన్నాడని అంతం చేసింది

హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిందో మహిళ. తాగిన మైకంలో కింద పడి మృతి చెందాడని మొదట అందరినీ నమ్మించేందుకు యత్నించింది. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా తానే మరో యువకుడి సహకారం తీసుకొని హత్య చేశానని ఒప్పుకుంది. సోమవారం  రాయదుర్గం సీఐ దుర్గప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం...

ప్రకాశం జిల్లా, చీరాలకు చెందిన గవిని సత్యనారాయణ(39), హిందూపూర్‌కు చెందిన సొంటిపాయి భావన(25) 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వస్త్ర వ్యాపారం చేసే సత్యనారాయణ నష్టాలు రావడంతో ఐపీ పెట్టాడు. ఈ క్రమంలోనే మణికొండ శ్రీనివాస కాలనీలోని సిల్వర్ స్ప్రింగ్స్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ తరచూ ఆమెతో గొడవపడేవాడు. హిందూపూర్‌లోని తల్లిగారి ఇంట్లో ఉన్న తన సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని ఈనెల 10న భర్తకు చెప్పి భావన వెళ్లింది. ఆమె అక్కడికి వెళ్లలేదని తెలిసి భర్త... ఫోన్ కాల్ డాటా ఆధారంగా భావన తిరుపతిలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడి వెళ్లాడు. ‘నీ విషయం నాకు తెలిసిపోయింది. నేను తిరుపతి వచ్చా’ అని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు.

దీంతో భావనతో పాటు ఆమె క్లాస్‌మెట్ కుమార్ సత్యనారాయణ వద్దకు వెళ్లారు. ఇద్దరూ కలిసి రావడంతో భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. నీవు హిందూపూర్ వెళ్లు.. నేను చీరాల వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. దీంతో తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని భావన ప్రియుడు కుమార్‌తో కలిసి పథకం వేసింది. ఈనెల 15న జూబ్లీహిల్స్‌లో స్నేహితుల వద్ద ఉన్న భర్తకు ఫోన్ చేసి.. నేను మన ఫ్లాట్‌కు వచ్చా.. నీవు కూడా రా అని పిలిచింది. అతను వెళ్లాక ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి బిర్యానీ, మద్యం తెచ్చుకున్నారు. భావన బిర్యానీ తినగా.. సత్యనారాయణ మద్యం తాగాడు.

ముందే వేసుకున్న పథకం ప్రకారం.. హిందూపూర్ నుంచి తన్వీర్(22) అనే యువకుడిని హైదరాబాద్‌కు రప్పించింది. సాయంత్రం 6 గంటలకు అతడికి ఫోన్ చేసి ఫ్లాట్‌కు పిలిచింది. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను అతడు గట్టిగా పట్టుకోగా... భావన పప్పు గుత్తితో భర్త గొంతుపై బలంగా నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తాగిన మైకంలో కిందపడి చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, మృతుడి మెడ కమిలిపోయి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి భావనను  విచారించగా తానే తన్వీర్ సహాయంతో చంపేశానని ఒప్పుకుంది.
 
కాగా, హిందూపూర్ నుంచి వచ్చిన తన్వీర్‌కు భావన.. భర్తను చంపేందుకు తనను పిలించిందని మొదట  తెలియదని పోలీసులు తెలిపారు. హత్యకు తన్వీర్ ముందు ఒప్పుకోలేదని, అయితే, అతడిని కూడా చంపేస్తానని భావన భయపెట్టిందన్నారు.  నిందితులు భావన, తన్వీర్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు కుమార్ కోసం గాలిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు