పదకొండు అంశాలతో ఎజెండా

25 May, 2016 03:15 IST|Sakshi

- ఖరారు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
- ఏపీ, తెలంగాణ జల వివాదంపై 27న సమావేశం...
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న సమావేశం ఎజెండాను ఖరారు చేసింది. నీటి యాజమాన్యం, కొత్త ప్రాజెక్టులు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధి వంటి వాటితో కలిపి మొత్తంగా 11 అంశాలను ఎజెండాలో చేర్చింది. ఈ మేరకు మంగళవారం సమావేశపు ఎజెండాను బోర్డు సభ్యకార్యదర్శి ఆర్‌కే గుప్తా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపారు. ఇందులో తొలి అంశంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు, తయారు చేసుకున్న ముసాయిదా అంశాల అమలు, వాటి కొనసాగింపును చేర్చారు. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశారు.

 పాలమూరు, డిండిపై చర్చ?
 నీటి వినియోగ లెక్కల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తరుచూ వివాదం రేకెత్తుతున్న దృష్ట్యా ముసాయిదా కొనసాగింపు, లేదా అందులో మార్పులకు బోర్డు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ట్లుగా తెలుస్తోంది. నీటి నిర్వహణ అంశాన్ని రెండో ప్రాధాన్యతగా చేర్చారు. కేవలం నీటి విడుదల సమయంలో మాత్రమే ఇరు రాష్ట్రాలు తమ అవసరాలు, వినియోగాన్ని పేర్కొంటున్నాయి తప్పితే ముందస్తుగా వెల్లడించడం లేదు. వివాదం తలెత్తినప్పుడు ఏ రాష్ట్ర లెక్కలు సరైనవన్నది తేల్చడం బోర్డుకు పెద్ద తలనొప్పిగా మారింది.

వీటితో పాటే ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణను ఎవరు చూడాలన్న దానిపై లోతుగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని బోర్డు భావిస్తోంది. దీంతో పాటే కృష్ణా పరీవాహకంలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల అంశాన్ని బోర్డు ఎజెండాలో చేర్చింది. తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల విషయంలో ఏపీ అనేక అభ్యంతరాలను లేవనెత్తుతోంది. ఈ అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు బోర్డు నిర్వహణ ఖర్చు, డ్యామ్‌ల భద్రత తదితర అంశాలను ఎజెండాలో చేర్చింది.

మరిన్ని వార్తలు