విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

10 Feb, 2016 19:49 IST|Sakshi

యాకుత్‌పురా: విదేశాల్లో అధిక మొత్తంలో సంపాదించే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఓ మధ్యవర్తిని రెయిన్‌బజార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ జి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా గంగానగర్ నాలా ప్రాంతానికి చెందిన దిల్‌దార్ ఖాన్, షాహీన్ బేగం (40)లు దంపతులు. షాహీన్ బేగంకు దుబాయ్‌లో ఎక్కువ మొత్తంలో చెల్లించే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమన్‌నగర్‌కు చెందిన మధ్యవర్తి ఆబేద్ హుస్సేన్ (45) నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకున్నాడు.

అనంతరం ముంబాయిలో ఉండే ఓ కన్సల్టెన్సీ సాయంతో గత డిసెంబర్‌లో షాహీన్ బేగంను దుబాయ్‌కి పంపించాడు. దుబాయ్‌లో పని ఎక్కువ చేయించుకుంటూ తక్కువ మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారని షాహీన్ బేగం భర్త దిల్‌దార్ ఖాన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీనిపై దిల్‌దార్ ఖాన్ మధ్యవర్తి ఆబేద్ హుస్సేన్‌ను ఆరా తీయగా సమాధానం దాట వేశాడు. దీంతో జరిగిన మోసంపై బాధితులు దిల్‌దార్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆబేద్ హుస్సేన్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆబేద్‌కు సహకరించిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు