‘కెమిస్ట్రీ’తోనే అధిక సమయం

10 Jul, 2016 05:09 IST|Sakshi
‘కెమిస్ట్రీ’తోనే అధిక సమయం

- ఎక్కువ ప్రశ్నలు సమస్యాపూరకంగా రావడంతో రాయలేకపోయామన్న విద్యార్థులు
- పరీక్షకు 90.76 శాతం హాజరు
- ప్రాథమిక కీ విడుదల, 12 వరకు అభ్యంతరాల స్వీకరణ, 14న ర్యాంకులు
 
 సాక్షి, హైదరాబాద్ : కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే అధిక సమయం పట్టడంతో మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాయలేకపోయామని పలువురు విద్యార్థులు వాపోయారు. దీనికి తోడు ఫిజిక్స్‌లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు రావడం, బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉండటం ఎక్కువ సమయం తీసుకున్నాయని అన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76% మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 50,964 మంది హాజరయ్యారు. 5,189 మంది గైర్హాజరయ్యారు. ఒక్క హైదరాబాద్ జోన్‌లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు.

ప్రశ్నల విషయానికి వస్తే సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. కీని ఎంసెట్-2 వెబ్‌సైట్‌లో (med.tseamcet.in) ఉంచింది.

ఈ నెల 12 మధ్యాహ్నం 2 గంటల వరకు కీపై  అభ్యంతరాలను (keyobjectionstseamcet2016@gmail.com) మెయిల్  ద్వారా స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈ నెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. జేఎన్‌టీయూహెచ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, డీఎంఈ డాక్టర్ రమణి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు