‘సమ్మె విరమిస్తేనే...’

29 Aug, 2016 23:58 IST|Sakshi
మణికొండ: డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలు సమ్మె విరమిస్తేనే వారి సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు మణికొండలోని మంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారు ఆందోళనకు సిద్ధ పడుతుండగానే మంత్రి బయటకు వచ్చి వారితో చర్చించి వినతిపత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగటం తగదన్నారు. రెండవ ఏఎన్‌ఎంల విషయంలో తాను ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించామని, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పథకం కేంద్రం మంజూరు చేయాల్సి ఉన్నందునే ఆలస్యం జరుగుతుందన్నారు.
 
సమ్మె విరమించి తన వద్దకు వస్తేనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. దాంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.   సీఐటీయూ నేతలు జైపాల్‌రెడ్డి, తెలంగాణ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి బలరాం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్‌ పద్దతిలో పనిచేస్తున్న  4వేల మంది  రెండ వ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలన్నా రు. 10 పీఆర్‌సీ ప్రకారం ఏఎన్‌ఎంలకు బేసిక్‌ జీతం రూ. 21.300లతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏలు సైతం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోనందునే సమ్మెకు దిగామన్నారు. కార్యక్రమం లో  కవిత, రోజా, రమాదేవి, అనిత, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు