‘బైపాస్’ లేకుండానే గుండెకు చికిత్స

10 Dec, 2015 05:07 IST|Sakshi
హైదర్గూడ అపోలో హాస్పటల్లో శస్త్ర చికిత్స వైద్యులు

దేశంలో ఇదే తొలిసారి: అపోలో వైద్యులు
హైదరాబాద్: హైదర్‌గూడ అపోలో ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. బైపాస్ సర్జరీతో పనిలేకుండా క్రాస్‌బాస్, స్ట్రింగ్‌రే వైద్య పరికరంతో పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు. ఈ తరహా చికిత్స చేయడం దేశంలో ఇదే మొదటిసారని వైద్యులు చెప్పారు. బుధవారం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యుల బృందం ఈ వివరాలను వెల్లడించింది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నలభయ్యేళ్ల వ్యక్తి కొంత కాలంగా తీవ్ర హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. స్థానికంగా పలువురు వైద్యులను సంప్రదించగా క్రానిక్ టోటల్ ఆక్లూజన్ (గుండె ప్రధాన రక్తనాళం వంద శాతం మూసుకుపోవడం)తో బాధపడుతున్నట్లు గుర్తించా రు. బైపాస్ ఒక్కటే దీనికి పరిష్కారమని తేల్చారు.

దీంతో ఆయన ఇటీవల హైదర్‌గూడ అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌లను సంప్రదించారు. డాక్టర్ వి.సూర్యప్రకాశరావు, డాక్టర్ కపర్దిలతో కూడిన వైద్య బృందం రోగి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. బైపాస్ సర్జరీ కంటే ఇటీవలే అమెరికాలో అందుబాటులోకి వచ్చిన సీటీఓ-పీటీఐ పద్ధతి ఉత్తమమని భావించారు.

ఛాతిపై ఎలాంటి కోతా లేకుండానే క్రాస్‌బాస్, స్ట్రింగ్‌రే వైద్య పరికరాలతో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్‌ను ధమనిలోకి పంపి, మూసుకుపోయిన రక్త నాళాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు. ఇందుకు రెండు గంటలు పట్టినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స చేసిన 48 గంటల్లోనే రోగిని డిశ్చార్జ్ చేశామన్నారు.

మరిన్ని వార్తలు