ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

4 Jun, 2016 20:12 IST|Sakshi

రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : బీటెక్ చదివింది కానీ చదువుకు తగ్గ ఉద్యోగం లేదు. పెద్ద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. శుక్రవారం సాయంత్రం అందరూ చూస్తుండగానే హుస్సేన్ సాగర్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మొదట గుర్తు తెలియని మృతదేహంగా భావించారు. సాక్షి పత్రికలో శనివారం ఆమె ఫొటో సహా వార్త ప్రచురించడంతో దీన్ని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించారు. మల్కాజ్‌గిరికి చెందిన ముత్యాలు నాలుగో సంతానం స్వర్ణలత(32).

ముత్యాలుకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం జరగగా భర్త చనిపోవడంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. మిగతా ఆరుగురికీ పెళ్లిళ్లు కాలేదు. స్వర్ణలత 2006-07 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసింది. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఎక్కడా సరైన కొలువు దొరకలేదు. ఒకవైపు కుటుంబ పరిస్థితులు, మరోవైపు ఉద్యోగం రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ట్యాంక్‌బండ్‌కు చేరుకుని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును ఎస్సై కృష్ణమోహన్ ధర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు