ఈ జీవితం నాకొద్దు

27 Mar, 2017 08:08 IST|Sakshi
ఈ జీవితం నాకొద్దు

పెళ్లిరోజే తనువు చాలించింది
అత్తింటి వారి వేధింపులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం


సనత్‌నగర్‌: ప్రేమించుకున్నారు..అందరినీ ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.. అయితే పెళ్లయిన ఆరు నెలలకే అత్తింటి వారు వేధింపులకు ఆమె తాళలేకపోయింది...పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్‌ ఇచ్చినా  ఫలితం లేకపోయింది...దీంతో తీవ్ర మనస్థాపంతో సరిగ్గా పెళ్లయిన ఏడాదికి.. అదీ పెళ్లిరోజే(శనివారం) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు.. బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశి గూగుల్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుని గత ఏడాది మార్చి 25న వివాహం చేసుకుని బేగంపేటలోని ఏఎండీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.

ఆరు నెలల పాటు సజావుగా సాగిన కాపురంలో విబేధాలు తలెత్తాయి. అత్తింటివారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి కొన్ని నెలల క్రితం బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించినప్పటికీ ఫలితం లేదు. శనివారం దంపతుల పెళ్ళిరోజు కావడం..భర్త తన వద్ద లేకపోవడం..  అత్తింటి వారి వేధింపులు...వెరసి మానసికంగా కుంగిపోయిన ఆమె శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఆమె ఉరేసుకున్న గది గోడలపై సూసైడ్‌ నోట్‌ రాసింది. నా చావుకు కారణం భర్త శశి, అత్తింటి కుటుంబసభ్యులు మంజుల, భాస్కర్, రమణిలు.  మానసికంగా హింసించారు. భర్త నా మాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నా శవాన్నీ, నాకు సంబంధించిన వస్తువులను ఎవరూ ముట్టుకోనీయవద్దు...బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు...వాళ్లను నమ్మవద్దు...అంటూ గోడపై రాసి పెట్టింది.  పోలీసులు అత్తింటివారిని అదుపులోకి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు