పెళ్లి సంబంధానికి వచ్చామని..

1 Mar, 2016 15:08 IST|Sakshi
పెళ్లి సంబంధానికి వచ్చామని..

మహిళపై దాడి చేసి.. దోపిడీకి యత్నం
కుమారుడి రాకతో పరారైన దుండగులు
 

మలక్‌పేట: పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు యజమానురాలిపై దాడి చేసి దోపిడీకి యత్నించారు. మలక్‌పేట ఠాణా పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం... సలీంనగర్-2 పార్కు సమీపంలో రతన్‌దేవి (53), కుమారుడు యశ్ తుస్నేవాలే(16)తో కలిసి ఓ భవనం కింద అంతస్తులో ఉంటున్నారు. అదే భవనంలో మొదటి అంతస్తులో ఆమె మరిది మనోజ్ తుస్నేవాలే ఉంటున్నాడు.  మరిది కుమారుడు సుశాంత్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.  

సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు రతన్‌దేవి ఇంటికి ముగ్గురు యువకులు, ఒక మహిళ వచ్చి డోర్ కొట్టారు. మీరెవరని రతన్‌దేవి ప్రశ్నించగా... సుశాంత్ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చామని చెప్పారు. ఆమె తలుపు తీయగా ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చున్నారు. ఆమెతో సంబంధం విషయం మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. ఇద్దరు కాళ్లు పట్టుకోగా..మరో ఇద్దరు రతన్‌దేవి గొంతుకు ప్లాస్లర్ బిగించి మూతిపై కొట్టారు. దీంతో నోటి నుంచి రక్తం కారి ఇంట్లో మరకలు పడ్డాయి. స్నానానికి వెళ్లిన ఆమె కుమారుడు యశ్ తుస్నేవాలే అప్పుడే బాత్రూం నుంచి బయటికి రాగా... లోపల గదిలో ఒక మహిళ, యువకుడు కనిపించాడు. అతను మీరెవరని ప్రశ్నిచడంతో వారు అక్కడి నుంచి తప్పించుకొని మెట్లమీద నుంచి గోడదూకి పరారయ్యారు.

యశ్ తుస్నేవాలే ముందు గదిలోకి వచ్చేసరికి సోఫాపై కూర్చున్న రతన్‌దేవికి ప్లాస్టర్‌తో గొంతు బిగించి ఉంది. అది చూసి అతను కేకలు వేయడంతో మిగతా ఇద్దరు దుండగులు రతన్‌దేవిని విడిచిపెట్టి బయటికి పరుగు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా మలక్‌పేట ఏసీపీ సుధాకర్, సీఐ గంగారెడ్డి, డీఎస్‌ఐ నరేష్  ఘటన్నా స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రతన్‌దేవి గొంతుకు గాయమై నోటి నుంచి రక్తం కారడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు హిందీలో మాట్లాడారని, వారి వయస్సు 25-26 ఏళ్ల మధ్య ఉంటుందని యశ్ తుస్నేవాలే పోలీసులకు తెలిపాడు. 

దుండగులు పారిపోయే క్రమంలో చెప్పులను ఘటనా స్థలంలో విడిచి వెళ్లారు. దుండగులు దోపిడీకి వచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే,  వారు సుశాంత్ పెళ్లి సంబంధం కోసమని చెప్పి రావడం బట్టి ఇందులో తెలిసిన వారి హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో గొలుసు చోరీ...
ఇదే ఇంటికి 2013లో ముగ్గురు వ్యక్తులు వచ్చి తలుపు తట్టారు. రతన్‌దేవి తలుపు తీయకుండా కిటికీ తెరిచి వారితో మాట్లాడుతుండగా కిటికిలోంచి చెయ్యిపెట్టి ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసు తెంచుకుని పరాయ్యారు. దాడి నేపథ్యంలో రతన్‌దేవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు